జగన్‌రెడ్డి చేసే మేలు ఉల్లి కూడాచెయ్యదు!!

– ట్విటర్‌లో సెటైర్లు వేసిన పవన్‌ కళ్యాణ్‌
అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : వైసీపీ సర్కార్‌కు ఉల్లి ధరలు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకపక్క ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, మరోపక్క జనసేన ఉల్లిధరలపై ప్రభుత్వం ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారని.. కానీ జగన్‌ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదని తనదైన శైలిలో విమర్శించారు. అందుకే ఉల్లి ఎందుకంటూ.. దాని రేటు పెంచేశారని సెటైర్‌ వేశారు. గత వారం రాయలసీమలో పర్యటించిన పవన్‌.. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.  ప్రభుత్వాల వైఫల్యం వల్లే ధరలు ఇంత ఎక్కువగా పెరిగాయని విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలతో మధ్యవర్తులే లాభపడుతున్నారని… రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. ఉల్లి కోసం ప్రజలు రోజంతా వేచిచూసే పరిస్థితి రావడం దారుణమన్నారు.
నిల్చోబెట్టి చంపేకంటే.. వాలంటీర్లను ఉపయోగించుకోండి..
గుడివాడ రైతు బజార్‌లో ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిల్చొని.. సాంబయ్య రెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన.. ప్రజలని క్యూలలో నుంచో పెట్టి చంపేకంటే, గ్రామ వాలంటీర్లను ఉపయోగించి, ప్రజలు ఇళ్ల దగ్గరికే.. కిలో 25 రూపాయలు చొప్పున ఎందుకు సరఫరా చేయట్లేదని ప్రశ్నించారు. దీనిపై జగన్‌ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మతమార్పిళ్లు, కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దుల విూద దృష్టి పెట్టిన వైసీపీ సర్కార్‌.. సగటు ప్రజల అవసరాల విూద, రైతుల కష్టాల విూద పెట్టుంటే బాగుండేదన్నారు.