జగన్‌ 100రోజుల పాలనకు 100మార్కులు

– అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌ మావాడే
– ఆర్టీసీని నెత్తివిూద పెట్టుకోవటం అదనపు భారమే
– మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి
అమరావతి, సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :   ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి 100రోజుల పాలనపై మాజీ ఎంపీ, టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పాలన పర్వాలేదని, 100 రోజుల పాలనకు 100 మార్కులు వేయవచ్చునని అన్నారు. ఈ100 రోజుల పాలనలో సంచలన నిర్ణయాలతో పాటూ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారని, ఎన్నికల హావిూలను నెరవేర్చే పనిలో ఉన్నారని అర్థమవుతుందని అన్నారు. జగన్‌ కిందపడుతూ.. పైకిలేస్తూ వస్తున్నాడని.. జగన్‌ను చేయిపట్టి నడిపించేవాడు కావాలని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. జగన్‌ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మావాడేనని, అంతేకాదు మావాడు చాలా తెలివైనవాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలని, అంతేగాని నేలకేసి కొట్టొద్దన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, ఎక్కడికీ తరలిపోదనే అభిప్రాయాన్ని జేసీ వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్‌ అడిగితే సలహాలు ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదని, అలాంటప్పుడు ఆర్టీసీని తెచ్చి నెత్తివిూద పెట్టుకోవడం అదనపు భారమే అంటూ జేసీ అన్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనం భారం అవుతుందని, ఏ ప్రభుత్వం కూడా వ్యాపారం చేయకూడదన్నారు. అధికారం చెలాయించాలి.. సమన్వయం చేయాలి.. ప్రైవేట్‌ వాళ్లకు ఇచ్చి అదుపులో పెట్టి నడిపించాలన్నారు. ఉద్యోగుల్ని విలీనం చేయడం వ్యాపారం చేయడమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.—-