జనగామలో అడవుల పెంపకం కోసం కసరత్తు

హరితహారంతో ముందుకు సాగాలని నిర్ణయం

జనగామ,జూలై17(జ‌నం సాక్షి): ఏమాత్రం అటవీ ప్రాంతం లేని కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో అడవిని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది విత్తనబంతుల ప్రయోగం విజయం కావడంతో మొక్కల పెంపకంపై ఆశలు చిగురించాయి. ఈ యేడాది కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు.డీఆర్‌డీవో జయచంద్రారెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగి హరితహారం కోసం కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 87లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం కేసీఆర్‌ అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించగానే జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ వాటితో కలిపి మొత్తం 301 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీకి 40వేల టార్గెట్‌ విధించారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో 3లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈసారి 54 నర్సరీల్లో మొక్కలు పెంచారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 30నర్సరీలు, అటవీశాఖ 24 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం టేకు మొక్కలే. ఈ మొక్కలను ఎక్కువగా పొలాల గట్ల వెంట నాటేలా గుంతలు తీయించారు. అంతేగాకుండా ఈసారి మైదాన ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 3లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వం చెట్లను విరివిగా పెంచాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఈ సీజన్‌లో వర్షాలు పడగానే హరితహారం కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి అందుకనుగుణంగా మొక్కలు నాటేలా సూచనలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోంది. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం చేసుకున్నాం. అటవీశాఖ పర్యవేక్షణలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుని లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్లు జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 87 లక్షల మొక్కలు నాటాలని నిశ్చయించాం. ఇప్పటికే కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆయా శాఖలతో పలుమార్లు సవిూక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసారి ఆయా మండలాలు, గ్రామాలను బ్లాక్‌లుగా చేసుకుని ఖాళీ ప్రాంతాలను గుర్తించి ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. అంతేగాకుండా నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు రెండు, మూడు గ్రామాలకు ఒక ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి నీళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్‌ సూచనల మేరకు ఈ దఫా జిల్లాలో లక్ష్యం మేరకు

మొక్కలు నాటేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రావిూణ అభివృద్ధి సంస్థ అధికారి జయచంద్రారెడ్డి వివరించారు. పోలీస్‌స్టేషన్‌, తహసీల్‌ కార్యాలయం, ఎక్సైజ్‌, ఇతర శాఖలను బ్లాక్‌లుగా విభజించి వారి టార్గెట్‌ మేరకు మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రైతులకు సంబంధించి 15లక్షల మొక్కలు సిద్ధం చేసి ఉంచాం. దీంతో పాటు కొన్ని రకాల చెట్ల గింజలను తెప్పించి విత్తాలనే ఆలోచన చేస్తున్నాం. సుబాబుల్‌ జాతికి చెందిన మొక్క పిలకలు వేసి ఒకటికి పది చెట్లుగా ఏర్పడే అవకాశమున్నందున అటవీ అధికారులను సంప్రందించి ఆ విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామని అన్నారు. హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను కాపాడేందుకు గానూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధిహావిూ కూలీలచే గుంతలు తీయిస్తున్నాం. మొక్కలు నాటిస్తాం. రోజుకు 10 మొక్కలు నాటిన కూలీలకు రోజువారీగా రూ.205లు చెల్లిస్తాం. కూలీలచే మొక్కల చుట్టూ ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తాం. మొక్కల సంరక్షణ చర్యల్లో భాగంగా మూడు గ్రామాలకు ఒక ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచుతామని వివరించారు.