జనరిక్‌ మందులను ఉపయోగించాలి

ఏలూరు,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): జనరిక్‌ ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా ప్రజలపై మందుల భారాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మందుల దోపిడీ కూడా పెరిగిందన్నారు. ప్రధానంగా ఈ ఆస్పత్రుల్లో జనరిక్‌ ఔషధాలను అందుబాటులోకి తేవాలన్నారు. సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్షగా మారిందని  అన్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం లో అనేక ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రధాన బాధ్యత
ప్రభుత్వాలపైనే ఉందన్నారు. కనీసం ఆయా సంస్థల సేవలను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. సామాన్య ప్రజానీకానికి సరైన పౌష్టికాహారం అందక నేడు అనేకమంది వివిధ రకాల వ్యాధులకు  గురౌతుంటే, ప్రభుత్వమే కాలుష్య పరిశ్రమలను ప్రోత్సహించడం దారుణమన్నారు. పచ్చటి గోదావరి జిల్లాల్లో కాలుష్యకారక పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయాలన్నారు. కాలుష్యం కారణంగా గాలి, నీరు, పరిసరాలు కలుషితమై ప్రజలు రోగాలబారిన పడుతున్నారని పేర్కొన్నారు.  అత్యధికంగా కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురౌతున్నారని అయినా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ కనబర్చడం లేదన్నారు. ఇప్పటికీ అనేక ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు లేరని, వైద్యులున్న చోట మందులు లేని పరిస్థితి నెలకొందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు చౌకగా మందులు అందాలనే దృక్పథంతో ఏలూరు, తాడేపల్లిగూడెం,
ఆకివీడులో జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేశామని వివరించారు. త్వరలో భీమవరం, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేయడానికి తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు.