జనసంద్రమైన పెద్దగట్టు

– శివనామ స్మరణలతో మారుమోగిన పెద్దగట్టు ప్రాంతం
– లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి
– భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడి
సూర్యాపేట, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. లింగమంతుల జాతరకు రాష్ట్రంతోపాటు ఏపీ, చత్తీస్‌ ఘడ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఓడిశా నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. లింగమంతుల స్వామికి బోనాలు, పొలముంతలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  రూ.10కోట్ల నిధులతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. 1800 మంది సిబ్బంది, 100 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జాతర ఏర్పాట్లను మంత్రి జగదీష్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే పెద్దగట్టు లింగమంతుల స్వామిని మంత్రి జగదీష్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లింగమంతుల స్వామి 100 ఏళ్ల చరిత్ర పుస్తకాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డి ఆవిష్కరించారు. జగదీష్‌ రెడ్డి దేశం నలుమూలల నుండి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు వచ్చిన భక్తులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేశామన్నారు. శాశ్వత కోనేరు, గుట్ట చుట్టూ రహదార్లు, మెట్ల మార్గాలు, శాశ్వత మరుగుదొడ్లు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే జరిగాయన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని, జాతరకు వచ్చిన ప్రతీ భక్తునికి మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నట్లు జగదీష్‌ రెడ్డి చెప్పారు.  జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సీసీ కెమెరా నిఘాలో భద్రతను ఏర్పాటు చేశామన్నారు. పెద్దగట్టు జాతరను 2014 కంటే ముందు పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెద్ద గట్టు జాతరకు గుర్తింపు లభించిందన్నారు. రాబోయే రోజుల్లో లింగమంతుల స్వామి దేవస్థానాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని జగదీష్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులకు లింగ మంతుల స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ వైవి, ఎంపీపీ వట్టే జానయ్య యాదవ్‌, గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల,
టీఆర్‌ఎస్‌ నాయకులు రామ్‌ మూర్తి, పెద్ద గట్టు చైర్మన్‌ కదారి సతీష్‌ యాదవ్‌, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, ఎస్పీ వెనకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.