జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం

– రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత
– ముగ్గురు మృతి, క్షతగాత్రులుగా మారిన 240మంది
– మృతుల సంఖ్య పెరిగే అవకాశం
– సహాయక చర్యలు వేగవంతం చేసిన అధికారులు
టోక్యో, జూన్‌18(జ‌నం సాక్షి) : భారీ ప్రకంపనలు జపాన్‌ను ఒక్కసారిగా వణికించాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం పశ్చిమ జపాన్‌ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఇప్పటిదాకా ముగ్గురు మరణించగా, 240 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. ఒసాకా పట్టణ కేంద్రంగా రిక్చర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావారణ శాఖ తెలిపింది. తీవ్రత తక్కువదే అయినప్పటికీ.. భూకంపం శక్తివంతమైనదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే సునావిూ అలర్ట్‌ మాత్రం ప్రకటించలేదు. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో ప్రకంపనలు సంభవించటంతో ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. వేల సంఖ్యలో ప్రజలు ఇళ్లు వదిలి భయంతో రోడ్ల విూదే గడిపారు. ఒసాకాతోపాటు రాజధాని టోక్యో, క్యోటో, ఇషాకా… ఇలా జపాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా అదే సమయంలో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 9 ఏళ్ల చిన్నారి ఉందని, ప్రస్తుతం విద్యుత్‌ సరఫరాను నిలిపేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. 1995లో 6.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం 6 వేల మందికి పైగా బలి తీసుకుంది. ఆ తర్వాత అంతటి స్థాయిలో కాకపోయినా.. తరచూ భూకంపాలు, సునావిూలు జపాన్‌ను వణికిస్తూ వస్తున్నాయి.