జపాన్‌లో వరద భీభత్సం

– విరిగిపడుతున్న కొండచరియలు
– 141కి చేరిన మృతుల సంఖ్య
– గత దశాబ్దకాలంలో భయంకరమైన విపత్తుగా అభివర్ణింస్తున్న అధికారులు
– లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలింపు
టోక్యో, జులై10(జ‌నంసాక్షి) : భారీ వర్షాలు, వరదల కారణంగా జపాన్‌ అతలాకుతలం అవుతోంది. వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడడంతో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 141కి చేరింది. గత దశాబ్ద కాలంలో వచ్చిన భయంకరమైన విపత్తు ఇదేనని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలతో దేశంలో పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. వర్షాలు తగ్గడంతో ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక సిబ్బంది ఇంటి ఇంటినీ గాలిస్తున్నారు. ఇళ్లలో చిక్కుకుపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం కోసం వెతుకుతున్నారు. వరద బీభత్సంతో ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది.
కుండపోత వర్షాలతో చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి. సిబ్బంది పడవల్లో సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కురషికి అనే నగరంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇళ్లు నీటమునిగి పోవడంతో ప్రజలు భవనాల పైకప్పుల ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో సహాయక సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా వారిని రక్షిస్తున్నారు. ప్రజల్ని కాపాడడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు వర్షాలం కారణంగా రహదారులు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. లక్షలాది మంది ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.