జయంత్ యాదవ్ అవుట్!

61482818399_625x300ముంబై: వచ్చే నెల్లో ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ నుంచి భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా అమోఘంగా రాణించిన జయంత్ యాదవ్.. మోకాలి గాయం కారణంగా చెన్నై టెస్టుకు దూరమయ్యాడు. అతను ఇంకా మోకాలి గాయం నుంచి తిరిగి కోలుకోలేకపోవడంతో వన్డే సిరీస్లో పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

దాంతో పాటు చెన్నైలో జరిగిన ఆఖరి టెస్టులో ఆడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ వేలికి గాయం అయ్యింది. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో డాసన్ క్యాచ్ను పట్టే క్రమంలో అక్షర్ కు గాయమైంది. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్కు అక్షర్ ఎంపికను దాదాపు పక్కకు పెట్టారు. ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు గాయాలు బారిన పడిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, మొహ్మద్ షమీలు గాయాలు బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య క్రమేపీ పెరుతోంది. గాయపడిన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడానికి ప్రస్తుతం టీమిండియా సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు.

జనవరి 15 నుంచి భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. అనంతరం జనవరి 26వ తేదీన మూడు ట్వంటీ 20 సిరీస్ జరుగుతుంది. అయితే దీనికి ముందు బోర్డు ఎలెవన్ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లను ఇంగ్లండ్ తో ఆడుతుంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోని పాల్గొననున్నాడు