జయపై సుప్రీం గుస్సా

1

న్యూఢిల్లీ,ఆగస్టు 24(జనంసాక్షి): పరవునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కోవాలే గానీ ప్రతీ విమర్శకు కేసులు వేయడం సరికాదని హితవు పలికింది. ప్రజాస్వామ్యం నడిచే విధానం ఇది కాదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 22కు వాయిదా వేసింది.  రాజకీయ ప్రత్యర్థులపై వరుసపెట్టి పరువునష్టం దావాలు వేయడాన్ని విమర్శించింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని తలంటు పోసింది. పరువునష్టం దావాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడినంత మాత్రాన పరువునష్టం దావాలు వేయడం కుదరదని, ప్రజా జీవితంలో ఉండే వ్యక్తిగా విమర్శలను ఎదుర్కోవాలని కోర్టు సూచించింది. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినందుకు గడిచిన ఐదేళ్లలో రాజకీయ ప్రత్యర్థులు, విూడియా సంస్థలపై మొత్తం 213 పరువు నష్టం దావాలను తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసింది. ముఖ్యమంత్రి సెలవుల గురించి, నీటి సమస్య గురించి, ఎన్నికల హావిూలు నెరవేర్చకపోవడం గురించి ఎవరేమన్నా అవన్నీ పరువునష్టం కిందే పరిగణించారు. గత రెండు నెలల్లో తమిళనాడు ప్రభుత్వాన్ని పరువునష్టం కేసుల్లో సుప్రీంకోర్టు విమర్శించడం ఇది రెండోసారి. ఇలా కేసులు వేయడం వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించడమే అవుతుందని సుప్రీం అప్పట్లో తెలిపింది. ఇలాంటి కేసులతో భయపెట్టి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని జయలలిత అనుకుంటారని ఆరపణలున్నాయి. పరువునష్టం విషయంలో సివిల్‌, క్రిమినల్‌ రెండు రకాల విచారణలు జరిగే అతికొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ కేసుల్లో రెండేళ్ల జైలుశిక్ష, లేదా జరిమానా లేదా రెండుశిక్షలూ వేయొచ్చు. తమిళనాడుకు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇది ఆరోసారి.