జలాశయ ప్రతిపాదిత స్థల పరిశీలన

harish-640x345అన్ని ప్రాంతాలకు సాగునీటి కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్‌

కరీంనగర్‌ పర్యటనలో మంత్రి హరీస్‌ రావు వెల్లడి

కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ శనివారం పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రులు జలాశయ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరాకృతిలో భాగంగా ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా జిల్లాలోని 2.50లక్షల ఎకరాలకు, ఎస్‌ఆర్‌ఎస్పీ చివరి ఆయకట్టుకు నీరు అందించనున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం నందిమేడారం శివారులో తవ్వుతున్న సొరంగాలను, భూ అంతర్భాగంలో ఏర్పాటు చేస్తున్న పంప్‌హౌస్‌ను మంత్రులు సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ  తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం కోసం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే దీక్షల పేరిట అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లను ప్రజలు క్షమించరని అన్నారు.  ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులను కట్టి తీరుతామని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ భవిష్యత్‌ తరాల కోసం రీ ఇంజినీరింగ్‌ చేసి ప్రాజెక్టులను కడుతుంటే ఓర్వలేక అడ్డుపడడం సమంజసం కాదన్నారు. రీడిజైనింగ్‌లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 4 నుంచి 25 టీఎంసీలకు, దేవాదులను 12 నుంచి 50 టీఎంసీలకు పెంచుతున్నామన్నారు. కాళేశ్వరం కింద ఉన్న 16 లక్షల ఎకరాల ఆయకట్టును 20 లక్షల ఎకరాలకు పెంచుతున్నామన్నారు. స్థిరీకరణ ద్వారా మరో 20 లక్షల ఎకరాలకు అదనంగా నీరందుతుందన్నారు. రాష్ట్ర ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకుండా పక్క రాష్టానికి వత్తాసు పలుకడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, సుధాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.