జస్టిస్‌ కర్ణన్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారణ నేరానికి పాల్పడిన అభియోగంపై తనకు విధించిన ఆరు నెలలు జైలుశిక్షను రీకాల్ చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ కర్ణన్‌ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులపై సుప్రీంకోర్టు సోమవారం మండిపడింది. కర్ణన్ ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉండగా, ఆయన తరఫు న్యాయవాది మాథ్యూ నెడుంపర మరోసారి రీకాల్ విజ్ఞప్తిని
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జగ్‌దీష్ సింగ్ ఖేహర్ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీనిపై తక్షణ విచారణ జరపాలని ఆయనను అభ్యర్థించారు. దీంతో సీజేఐ మండిపడ్డారు. ‘మీరు పదేపదే విజ్ఞప్తులు చేస్తూ కోర్టు సమయాన్నివృథా చేస్తున్నారు. కేసు ఎప్పుడు విచారణకు వస్తే అప్పుడే దానిపై విచారణ జరుగుతుంది’ అని కర్ణన్ న్యాయవాదికి తేల్చిచెప్పారు. కర్ణన్‌కు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన ఏడుగురు న్యామూర్తుల బెంచ్‌కు కేహార్ నేతృత్వం వహించారు. కర్ణన్ తరఫు న్యాయవాది గత శుక్రవారం కూడా తన క్లయింట్‌ను అరెస్టు చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ ఆయనను అప్లికేషన్ ఫైల్ చేసి ఆ విషయం తమకు చెప్పమని, ఎప్పుడు ఏడుగురు జడ్జిలు అందుబాటులో ఉంటారో అప్పుడు వాదన వింటామని చెప్పారు. బేషరుతు క్షమాపణకు తాము సిద్ధంగా ఉన్నా తమ అప్లికేషన్‌ను రిజిస్ట్రీ తీసుకోవడం లేదని మాథ్యూ నెడుంపర కోర్టు దృష్టికి తెచ్చారు. ఆదివారంనాడు కూడా ఆయన కోర్టు ధిక్కారం అంశంలో ఉపశమన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు.