జాబితాపై ఎఐసిసి కసరత్తు

రాష్ట్రనేతలతో చర్చించి నేడు ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ జాబితాపై ఎఐసిసి కసరత్తు చేస్తోంది. తమముందుకు వచ్చిన అబ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. గురువారం జాబితాలో కొందరి పేర్లు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఓ నలభై మంది పేర్లు ఖరారయ్యాయని అంటున్నారు. వీరంతా సిట్టింగ్‌లే కావడం విశేషం. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి హుటాహుటిన దిల్లీకి బయలు దేరి వెళ్లారు. అభ్యర్ధుల ఖరారు తుది దశకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ జాతీయ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ ఏకే ఆంటోని పిలుపుతో ఉత్తమ్‌ బయల్దేరి వెళ్లినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ప్రచారకమిటీ ఛైర్మన్‌ భట్టి విక్రమార్క కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. వీరంతా ఏకే ఆంటోనితో సమావేశమై అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. పొత్తులతో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన సీట్లు మినహా మిగిలిన స్థానాలకు చెందిన అభ్యర్ధులపై జాతీయ ఎన్నికల కమిటీ నియోజక వర్గాల వారీగా పరిశీలించనుంది. అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం నెలకొందన్న భావనతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వివాదస్పదంకాని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని పీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొత్తులతో పోయే 27 నుంచి 29 స్థానాలు, ఎక్కువ మంది పోటీ పడుతున్న మరొక 15 నుంచి 20 నియోజక వర్గాలను మినహాయించి 70 నుంచి 75 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ ఎన్నికల కమిటీ ఆ జాబితాకు ఆమోదముద్ర వేసిన అనంతరం రేపు రాహుల్‌ గాంధీ వద్దకు చేరుతుందని..అక్కడ ఆయన పరిశీలన తరువాత ఏఐసీసీయే అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.