జింబాబ్వేలో సైనిక చర్య కలకలం

హరారే,నవంబర్‌ 15,(జనంసాక్షి): జింబాబ్వే సైన్యం అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిందన్న వార్తలు తాజాగా కలకలం రేపాయి. అయితే సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని బుధవారం ఉదయం అక్కడి అధికారిక విూడియాలో సైన్యం వెల్లడించింది. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టు ఉన్న క్రిమినల్స్‌ను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ చేపడుతున్నామని వివరించింది. ఈ చర్యతో ప్రభుత్వాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకున్నట్టు కాదని ఆర్మీ జనరల్‌ ఒకరు తెలిపారు. ‘అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది.. వారి రక్షణకు మేం హావిూ ఇస్తున్నాం. అధ్యక్షుడి వెంట ఉండి నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌నే మేం టార్గెట్‌ చేశాం. మా లక్ష్యాన్ని సాధించిన వెంటనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నాం’ అని తెలిపారు. మంగళవారం అధ్యక్షుడి ప్రైవేటు నివాసం చుట్టూ భారీగా సైనిక వాహనాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో కాల్పులు కూడా చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అధ్యక్షుడిపై సైన్యం తిరుగుబాటుకు యత్నించిందని వార్తలు గుప్పుమన్నాయి. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం వచ్చిన 1980 నుంచి నేటి వరకూ జింబాబ్వేలో ముగాబే పాలన కొనసాగుతోంది. ఇటీవల 93 ఏళ్ల అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు ముదిరాయి. ముగాబేకు చెందిన జాను-పీఎఫ్‌ పార్టీ.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కాన్‌స్టాంటినో చివేంగాపై తీవ్ర ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.