జియోకు షాక్‌: 4G నెట్‌వర్క్‌లో ఎయిర్‌టెల్ టాప్

గ‌తేడాది టెలికాం రంగంలోకి ముఖేష్ అంబానీ రిల‌యన్స్ జియో ఎంట్రీ ఇవ్వ‌డంతో మిగ‌తా నెట్‌వ‌ర్క్‌ల ధ‌ర‌లు ఒక్క‌సారిగా దిగొచ్చాయ్‌. కాంపిటీష‌న్ త‌ట్టుకుని త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు ఆయా నెట్‌వ‌ర్క్‌లు త‌మ‌కు త‌గిన‌ట్లుగా ఆఫ‌ర్ల‌తో హోరెత్తించాయి. ఆ త‌ర్వాత మార్కెట్‌లో నిల‌దొక్కుకున్నాయి. ఎంట్రీతోనే జియో విప‌రీత‌మైన ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్లు, ఉచిత 4జీ డేటా ఇచ్చిన‌ప్ప‌టికీ 4జీ నెట్‌వ‌ర్క్ స్పీడ్‌లో మాత్రం ఎయిర్‌టెల్ దేశంలో ఇత‌ర నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ల కంటే ముందుంద‌ని ఓపెన్ సిగ్న‌ల్స్ అనే సంస్థ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల‌పై ఓపెన్ సిగ్న‌ల్స్ సంస్థ ప‌రిశోధ‌న‌లు చేయ‌గా మ‌న దేశంలో  4జీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ల‌లో ఎయిర్‌టెల్ తొలిస్థానంలో నిలిచింద‌ని పేర్కొంది.  ఎయిర్‌టెల్ కేవ‌లం 4జీ స్పీడ్ అవార్డు మాత్ర‌మే గెలుచుకోలేదు..3జీ స్పీడ్‌లో కూడా ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌తో పోలిస్తే ఎయిర్‌టెల్ ముందువ‌ర‌స‌లో ఉంద‌ని ఓపెన్ సిగ్న‌ల్స్ సంస్థ తెలిపింది. త‌మ స్ట‌డీలో ఎయిర్‌టెల్ యావ‌రేజ్ LTE డౌన్‌లోడ్ స్పీడ్ 11.5 Mbps ఉంద‌ని అది వొడాఫోన్‌, ఐడియా నెట్‌వ‌ర్క్‌ల స్పీడ్‌కంటే 3 Mbps ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది.

డిసెంబ‌ర్ 2016 నుంచి ఫిబ్ర‌వ‌రి 2017 వ‌ర‌కు 93,464 స్మార్ట్ ఫోన్ వినియోగదారుల‌పై  ఓపెన్ సిగ్న‌ల్స్ ప‌రిశోధ‌న చేప‌ట్టింది. ఇందులో ఎయిర్‌టెల్ 4జీ,3జీతో పాటు 2జీ స్పీడ్ కూడా ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌తో పోలిస్తే ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు తేల్చింది. వొడ‌ఫోన్ యావ‌రేజ్ LTE డౌన్‌లోడ్ స్పీడ్ 8.59 Mbps ఉండ‌గా ఆ త‌ర్వాతి స్థానంలో ఐడియా 8.34Mbpsతో నిలిచింది. ఇక జియో స్పీడ్ మ‌రింత దారుణంగా ఉన్న‌ట్లు తెలిపింది. కేవ‌లం 3.92Mbps డౌన్‌లోడ్ స్పీడ్ మాత్ర‌మే జియోలో  వ‌స్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది ఓపెన్ సిగ్న‌ల్స్ సంస్థ‌.