జిల్లాలో పత్తి కొనుగోళ్లలో మోసాలు

గిట్టుబాటు దక్కక రైతుల ఆందోళన

జగిత్యాల,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు వెల్గటూర్‌ మండలంలోని కొత్తపేటలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. గతంలో గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి అంతగా పత్తి రాకపోవడంతో ఈసారి కేవలం వెల్గటూర్‌ మండలం కొత్తపేటలోనే సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నిబంధనల పేరిట కొత్తపేట సీసీఐ కొనుగోలు కేంద్రంలో అధికారులు ఇప్పటివరకు కేవలం 3585.40 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రైవేట్‌ వ్యాపారులు 6,605 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 90 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 8 శాతంకన్నా తేమ ఎక్కువగా ఉందంటూ కొత్తపేటలోని సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు తిప్పి పంపుతున్నారు. కొందరు ఆదిలాబాద్‌ జిల్లాలోని భైంసాకు వెళ్లి విక్రయించుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 18 వేల మంది రైతులు పత్తి పంట సాగు చేయగా, అధికారుల లెక్కల ప్రకారం లక్ష క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇప్పటివరకు సీసీఐతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు 10 వేల క్వింటాళ్లు కూడా పంట కొనుగోలు చేయలేదు. ఇంకా 90 శాతం పంట రైతుల వద్దే ఉంది. కొడిమ్యాల మండలంలోని హిమ్మత్‌రావుపేటలో శనివారం దళారులు పత్తి పంటను కొనుగోలు చేయగా, తూకంలో తేడాలు వచ్చాయి.