జిల్లాలో పెరుగుతున్న ఎండలతో ఆందోళన

నల్లగొండ,మార్చి27(జ‌నంసాక్షి): జిల్లాలో గడిచిన వారం రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతోంది. వాతావరణం మార్పుల నేపథ్యంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా ఉంటున్నాయి. తీవ్రత  పెరుగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మార్చి రెండోవారం వరకు పెద్దగా ఎండ తీవ్రత కనిపించలేదు. ఆపై వాతావరణంలో నెలకొన్న మార్పుల నేపథ్యంలో ఇది క్రమంగా పెరుగుతుంది.  ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికి సాయంత్రం 4గంటల వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది. మధ్యాహ్నం ఇళ్లలోని బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఒక పూట బడులు జరుగుతున్న క్రమంలో పిల్లలు ఇంటికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వాతావరణంలో వేడి గాలులు వీస్తున్నాయి. అదే విధంగా మధ్య రాత్రి వరకు వాతావరణంలో తేమ లేని కారణంగా వేడితో  ఉక్కపోత ప్రారంభమైంది.