జిల్లాలో వైద్యాధికారుల అప్రమత్తం

 

ఖమ్మం,ఆగస్ట్‌30: గోదావరిలో వరద పెరగడంతో మన్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా తదితర కేసులు నమోదయితే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో గతంలో 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 53 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మిగిలాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఐటీడీఏపరిధిలో 29 పీహెచ్‌సీలు ఉన్నాయి. గతంలో గుర్తించిన 658 సమస్యాత్మక ఆవాసాలు మన్యంలోనివే. ఈ ప్రాంతంలో దోమల తీవ్రత ఉండటం వల్ల మలేరియా, డెంగీ, గన్యా వంటి వ్యాధులు ప్రబలుతున్నట్లు గుర్తించారు. ఈ గ్రామాల్లో ప్రతీచోట పిచికారి చేయడంతోపాటు నిరంతర పర్యవేక్షణ పెంచారు. అప్పటి ఐటీడీఏ పీవో, ప్రస్తుత కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ తరచూ మలేరియా విభాగంపై సవిూక్ష చేయడంతో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు జిల్లాల్లో కలిపి ఉన్న ఆవాసాల్లో దోమల మందును పిచికారి చేస్తేనే దోమల ఉనికిని పూర్తిగా నాశనం చేసేందుకు వీలవుతుంది. మైదానం ప్రాంతంలోని కొన్ని మండలాల్లో దోమకాటు కేసులు తక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో గతంలో కొంత నిర్లక్ష్యం వహించారు. మన్యంలో ఐటీడీఏ సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు. మన్యంలో జ్వరాల తీవ్రత బాగా తగ్గడానికి చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది మన్యంలో మలేరియా జ్వరాల సంఖ్య బాగా తగ్గింది.