జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

నెల్లూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని.. మంగళవారం నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో వైరల్‌ ఫీవర్లు, డెంగ్యూ ఫీవర్‌, స్వైన్‌ ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలుతుంటే వైద్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ వ్యాధులకు గురి కావడంతో కార్పొరేట్‌ వైద్యులు వేలాది వేల రూపాయలు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.