జీవితంలో ఫెయిల్‌ అన్నది ఓ లెక్క కాదు

కొడుకు టెన్త్‌ ఫెయిల్‌ అయితే పార్టీ ఇచ్చి ప్రోత్సహించిన తండ్రి
భోపాల్‌,మే16(జ‌నం సాక్షి):  పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణులైతే చుట్టుపక్కల వాళ్లని, బంధువులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చే తల్లిదండ్రులను చూశాం. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ తండ్రి తన కుమారుడు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు పార్టీ ఇచ్చాడు. దీంతో అంతా షాక్‌ అయ్యారు. ఇదేవిూ అర్థం కాక పార్టీలో నోరు వెళ్లబెట్టారు. కొడుకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య గట్రా చేసుకోకుండా ఆ తండ్రి తన తనయుడిని ప్రోత్సహిఒంచేందుకే ఇలా చేశాడని తెలుసుకుని అవాక్కయ్యారు. భోపాల్‌కు చెందిన సురేంద్ర కుమార్‌ కుమారుడు అశు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడు. అందుకు ఆయన తన కుమారుడిని తిట్టి, కొట్టకుండా వినూత్నంగా ఇంటి ముందు టెంటు వేసి ఘనంగా పార్టీ ఇచ్చాడు. స్నేహితులు, బంధువులను పిలిపించి స్వీట్లు పంచి వారితో కలిసి టపాసులు పేల్చాడు. ఈ విషయం స్థానిక విూడియా వర్గాలకు తెలియడంతో వారంతా సురేంద్ర ఇంటికి పరుగులు తీశారు. కొడుకు ఫెయిల్‌ అయితే పార్టీ ఎందుకు ఇస్తున్నారు? అని అడిగితే..’ఫలితాలు అంత ముఖ్యం కాదు. మా అబ్బాయి చదవనందుకు
ఫెయిల్‌ అవ్వలేదు. వాడు చాలా కష్టపడ్డాడు. పరీక్షలకు మించి జీవితంలో ఇంకా ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. వాడు ఫెయిల్‌ అయ్యాడని నేను కొడితే అది మనసులో పెట్టుకుని ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే తట్టుకోలేను. దాని బదులు ఇలా పార్టీ ఇచ్చి వాడిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యకాలంలో పిల్లలు పరీక్షల్లో ఫెయిల్‌ అయితే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలందరికీ నేను ఒక్కటే చెప్పాలను కుంటున్నాను. మొన్న జరిగిన బోర్డు పరీక్షలే ఆఖరి పరీక్షలు అనుకోవద్దు. అంతకంటే జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. మా అబ్బాయి ఈ ఏడాది ఫెయిల్‌ అయ్యాడు. వచ్చే ఏడాది ఉత్తీర్ణుడవుతాడు.’ సురేంద్ర కుమార్‌ భోపాల్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమారుడి విషయంలో అతను తీసుకున్న వినూత్న నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నారు. ఈ సందర్భంగా సురేంద్ర కుమారుడు అశు మాట్లాడుతూ..’నన్ను ఏవిూ అననందుకు మా నాన్నకు కృతజ్ఞతలు. వచ్చే ఏడాది బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని నాన్నకు మాటిస్తున్నాను.’ అని పేర్కొన్నాడు.
——