జెనరిక్‌ మందుల వాడకంపై దుష్పచ్రారం?

మెడికల్‌ షాపుల వారిదే కీలక పాత్ర
మహబూబ్‌నగర్‌,మే16(జ‌నం సాక్షి): జనరిక్‌ మందుల వాడకంపై ఇప్పుడు దుష్పచ్రారం మొదలయ్యింది. అవి వాడితే రోగాలు నయం కావన్న ప్రచారాన్ని  మెల్లగా తెరపైకి తెచ్చారు. మెడికల్‌ షాపుల వారే దీనిని ప్రచారం చేస్తున్నారు. తక్కువ ధరలకు మందులు ఇవ్వాల్సి ఉంటుందని భావించి ఈ కైన ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఔషధాలు అందించాలని ఇచ్చిన ఆదేశాలు ఎవరికీ పట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు దీనిపై పర్యవేక్షణ చేపట్టకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో పాత పద్ధతిలోనే చీటీలపై ఔషధాలు రాస్తున్నారు. ఆ మందులను దుకాణాల్లో అధిక ధరలు చెల్లించి ప్రజలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది ప్రభుత్వ ఆస్పత్రులకు చికిత్స కోసం వస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో జెనరిక్‌ మందుల దుకాణం ఉంది. ఇందులో బయటి మెడికల్‌ దుకాణాల కంటే సుమారు 30 నుంచి 70 శాతం వరకు తక్కువ ధరలల్లో ఔషధాలు లభిస్తాయి. కానీ జెనరిక్‌ మందుల దుకాణాల గురించి ఎవరికీ తెలియదు. మహబూబ్‌నగర్‌లో నాలుగు మాత్రమే జెనరిక్‌ మందుల దుకాణాలు ఉన్నాయి. ప్రధాన పట్టణాలైన నాగర్‌కర్నూలు, గద్వాల, వనపర్తి, జడ్చర్ల, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో అసలు జెనరిక్‌ మందులంటేనే ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. దీంతో మెడికల్‌ దుకాణదారులు బ్రాండ్‌ ఔషధాల మాటున అందినకాడికి దోచుకుంటున్నారు. వీరికి వైద్యులు కూడా సహకారం అందిస్తున్నారు. జెనరిక్‌ మందులు వాడితే రోగం నయం కాదన్న ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆస్పత్రుల్లో ఎంసీఐ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. వైద్యులు పాత పద్ధతిలోనే చీటీలు రాస్తున్నారు. జెనరిక్‌ మందులనే రాయాలని సాక్షాత్తు దేశ ప్రధాని పేర్కొన్నారు. జిల్లాలో మాత్రం వైద్యులు ఈ ఆదేశాలను ఎంతమాత్రం పాటించడం లేదు. బ్రాండ్‌ కంపెనీలు తయారు చేసే మాత్రలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ప్రచారం నిర్వహిస్తాయి. వారు వైద్యులకు కొన్ని మాత్రలను ఉచితంగా ఇస్తారు. ప్రత్యేక ప్రతినిధులను (మెడికల్‌ రెప్స్‌) ఏర్పాటు చేసుకొని ఆస్పత్రుల్లో ప్రచారం చేపడతారు. వారికి పెద్ద మొత్తంలో జీతాలు చెల్లిస్తారు. దీంతో మందుల ధరలు సుంకం పేరుతో అమాంతం పెంచి అమ్ముతారు.
వైద్యులు కూడా ఈ మందులకే ప్రాధాన్యం ఇస్తారు. పేదలు దోపిడీకి గురికాకుండా ఆపాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జెనరిక్‌ మందుల విధానం మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జోగులాంబ జిల్లాల్లొ ఎక్కడా అమలు కావడం లేదు. పలు ఆస్పత్రుల వద్ద డాక్టర్లు పాత పద్ధతిలోనే మందుల చీటీలను
రాస్తున్నారు.
…………………….