జోగు ఫౌండేషన్‌ ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు

ఆదిలాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): జోగు ఫౌండేషన్‌ తరఫున విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్స్‌ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇదివరకే 17 వేల స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్స్‌ కోసం ఆర్డర్‌ చేశామన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు. గత ఏడాది పంపిణీ చేసిన బుక్స్‌లోని అనేక విషయాలు సులువైన మార్గంలో ఇంగ్లిష్‌ అర్థమయ్యేలా, నేర్చుకునేలా ఉన్నాయన్నారు. ఈసారి కూడా బుక్స్‌ త్వరలోనే విద్యార్థులందరికీ పంపిణీ చేస్తామన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్‌ హయాంలో విద్య, వైద్య, ఉద్యోగం వంటి అన్ని రంగాల్లో ముందున్నా మన్నారు. అన్నింటి కంటే ముఖ్యమైంది విద్య అని గుర్తు చేశారు. గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తూ, ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇంగ్లిష్‌ విూడియం గురుకులాల్లో కార్పొరేట్‌కు దీటుగా ఉచిత విద్యను అందిస్తున్నామని రామన్న అన్నారు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులు కృషి చేయాలన్నారు. చదువుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గురువులు చెప్పిన విద్యను క్రమశిక్షణతో నేర్చుకోవాలన్నారు.