జోనల్‌ వ్యవస్థ కొనసాగించాలి

5

– కొత్త జిల్లాల ప్రాతిపదిక ఏంది?

హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి): కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను గ్రామసభల ద్వారా తెలియ చేయాలని అన్నారు. జిల్లాలలోని లోకల్‌ రిజర్వేషన్లపై ప్రత్యేకచర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు  ప్రతీ విషయంపై మేధావుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించగలిగితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుందన్నారు. రీలోకలైజేషన్‌ ఎలా జరుగుతుందన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇప్పుడున్న ఉద్యోగులకే జోనల్‌ వ్యవస్ధను కొనసాగిస్తామనడం సబబుకాదని.. భవిష్యత్‌ ఉద్యోగులకు కూడా జోనల్‌ వ్యవస్ధ అమలు చేయాలని సూచించారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని కోరారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలపాలని ఆయన అన్నారు.గద్వాల, జనగామ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ఇక మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందం మంచిదే గానీ, ఆ ఒప్పందం వివరాలేంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే… ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ డైరీలో ఉన్న వివరాలు అన్నింటినీ కూడా బయటపెట్టాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.