జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

ఊరూవాడా చుట్టి వస్తున్న నేతలు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ నాయకుల సమక్షంలో గులాబీ పార్టీలో చేరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లుగా సర్కారు పథకాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని ప్రచార కార్యక్రమంలో నేతలు చెబుతున్నారు. మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సైతం జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులు నుంచి పలు గ్రా మాల్లో వందల సంఖ్యలో స్థానికులు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మంత్రి జోగు రామన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం మంజూరు చేశామని, ఇండ్లు నిర్మిస్తున్నామని, అవి తుది దశలో ఉన్నాయన్నారు. కులవృత్తుల ఉపాధిని మెరుగుపర్చేందుకు పలు కార్యక్రమాలను చేపట్టామన్నారు. సార్వత్రిక ఎన్నికల కన్నా ముందే మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నల్లా నీటిని అందిస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే వేల కోట్ల నిధులు మంజూరు చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తామన్నారు. కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రా థోడ్‌ బాపురావు కూడా పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.ఎనిమిది వేలను అందించడంతో పేద రైతులకు పెట్టుబడులకు ఢోకా లేకుండా పోయిందని తెలిపారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రేఖానాయక్‌ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలను విస్మరించి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరేలా చూడాలని కోరారు. క్షేత్రస్థాయిలో అందరిని కలుపుకొని పోయేలా సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఇప్పటికే బంగారు తెలంగాణకు బాటలు పట్టాయని తెలిపారు. తెలంగాణ దశ దిశ మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. జిల్లాలో ఇప్పటికే పలు ప్రగతిలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్నిచోట్లా భారీ మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు.