టప్పాచబుత్రలో కార్డన్‌ సెర్చ్‌

అనుమతిలేని వాహనాలు స్వాధీనం
హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): టప్పాచబుత్ర పరిధిలోని అల్లూరి సీతారామరాజునగర్‌ మురికివాడ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సోదాలు చేశారు. ఆధార్‌ కార్డులతోపాటు ఇతర గుర్తింపు కార్డుల్ని పరిశీలించి వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, చదువులు, వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. కట్టడి ముట్టడి కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 22 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 29 మంది అనుమానితుల్ని పట్టుకున్నారు. అధికారులతో కలిపి మొత్తం 220 మంది పోలీసులు కట్టడి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, ఏసీపీ అశోకచక్రవర్తి, టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌.చంద్రశేఖర్‌, పి.వెంకటేశ్వర్లుతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పోచారం అన్నోజిగూడలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు నిర్బంద తనిఖీ నిర్వహించారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీలు సందీప్‌, కృష్ణమూర్తి, స్థానిక సీఐ రఘువీర్‌రెడ్డి, డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాలకు చెందిన 300 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అన్నోజిగూడ లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. స్థానికుల ఆధార్‌ వివరాలు, చేస్తున్న వృత్తి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నేళ్లుగా ఉంటున్నారు, ఏమైనా కేసులు ఉన్నాయా తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 13 గ్యాస్‌ సిలిండర్లు, వెయ్యి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. నేరాలు నియంత్రణకు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వారికి ఇల్లు అ/-దదెకు ఇచ్చే ముందు తప్పనిసరిగా వారి వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిచాలని సూచించారు.