టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తాం!

– కుర్దు దళాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
– హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
వాషింగ్టన్‌, జనవరి14(జ‌నంసాక్షి) : సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దు దళాలపై టర్కీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, అలా చేస్తే.. టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇటీవల సిరియా నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ నిర్ణయించారు. దీంతో అక్కడి కుర్దు దళాలపై టర్కీ దాడులు చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. కుర్దులను టర్కీ తీవ్రవాదులుగా పరిగణిస్తోంది. వారి కారణంగా దేశంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుర్దులను ఉద్దేశించి ఒక ట్వీట్‌ చేశారు. టర్కీని రెచ్చగొట్టే చర్యలు చేపట్టవద్దని కుర్దులకు హితవు పలికారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న బలగాల ఉపసంహరణ సిరియాలో మొదలైందని, ఐసిస్‌ అక్కడ నామమాత్రంగానే మిగిలిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఒక వేళ అది మళ్లీ పడగవిప్పితే సవిూప స్థావరాల నుంచి ఐసిస్‌పై దాడులు చేస్తామని, కుర్దు బలగాలపై టర్కీ దాడులకు తెగబడితే ఆ దేశాన్ని ఆర్థికంగా నాశనం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. 20 మైళ్ల మేరకు
సురక్షిత జోన్‌ను ఏర్పాటు చేయాలని, అలానే కుర్దులు కూడా టర్కీని రెచ్చగొట్టకూడదని, ఐసిస్‌ను నాశనం చేయాలన్న అమెరికా నిర్ణయం నుంచి సిరియా, ఇరాన్‌, రష్యాలు లబ్ధిపొందుతున్నాయన్నారు. మేము కూడా లబ్ధిపొందామని, కానీ అంతం లేని ఈ యుద్ధానికి ఒక ముగింపు పలికేందుకు ఇప్పుడు బలగాలను వెనక్కి పిలిపిస్తున్నామని ట్రంప్‌ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. శుక్రవారం నుంచి అమెరికా బలగాలు సిరియా నుంచి వైదొలగడం ప్రారంభించాయి. కేవలం 2,000 మంది సైనికులు మినహా మిగిలిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ బలగాల ఉపసంహరణ కొన్ని వారాలపాటు కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ఐసిస్‌పై తమ ఒత్తిడి కొనసాగుతుందని శ్వేతసౌధం తెలిపింది.