టిఆర్‌ఎస్‌ది పదహారు సీట్ల రాజకీయం

కుటుంబ వారసత్వం కోసం తహతహ
బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విమర్శ
మెదక్‌,మార్చి29(జ‌నంసాక్షి): పదహారు సీట్లతో రాజ్యమేలుతామని టిఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని మెదక్‌ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ ప్రజలను బురిడీ కొట్టించే పనిలో టిఆర్‌ఎస్‌ నేతలు పడ్డారని అన్నారు. ఇదంతా ఓ రకంగా ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరోటి కాదన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వమేనని అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తూ ఓట్లను అభ్యర్థించారు.
కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు ఎజెండా లేదని, అటువంటి పార్టీలకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. పేదరిక నిర్మూలన బీజేపీ ఎజెండాగా పెట్టుకుంటే, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు మోదీని ఆపడమే లక్ష్యంగా చేసుకున్నా యని పేర్కొన్నారు. ప్రజల కోరికల్నే తమ ఎజెండాగా చేసుకున్న ప్రధాని మోదీ కావాలో, కుటుంబ ప్రయోజనాల్నే తమ ఎజెండాగా చేసుకున్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు కావాలో తేల్చుకోవాలన్నారు. దేశభద్రతపై మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలను కాంగ్రెస్‌ విమర్శించడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే వాటి రుజువులు కావాలని రక్షణ బలగాలను కాంగ్రెస్‌ అవమానించింద న్నారు. ఇప్పటివరకూ శిఖరంపై ఉన్న టీఆర్‌ఎస్‌కు కిందికి దిగడం ప్రారంభమైందన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికలతో అది పూర్తవుతుందని, అందుకే కేసీఆర్‌, కేటీఆర్‌ అడ్డగోలుగా బీజేపీని విమర్శిస్తున్నారని తెలిపారు. వారు చేస్తున్న ప్రచారంలో పసలేదన్నారు. కుటుంబ పాలనకు బిజెపి వ్యతిరేకమని అన్నారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు అదే ఆయువుపట్టని రఘునందన్‌ రావు దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల్లేకుండా రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.  పేదలకు అందించే రేషన్‌ బియ్యానికి రూ.29.60 కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, పింఛన్లు, వంటగ్యాస్‌, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాధి హావిూ పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్షేమ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తుందని భాజపా అభ్యర్థి అన్నారు.