టిఆర్‌ఎస్‌లో ఉలిక్కిపాటు

కెటిఆర్‌కు నడ్డా తెలియకపోవడం రాజకీయ అవివేకం
మండిపడ్డ ఆచారి
మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగసభ విజయవంతం కావడం, బీజేపీలోకి పలువురు నేతల చేరికలను చూసి టీఆర్‌ఎస్‌ నాయకులకు భయం పట్టుకుందని బిజెపి రాష్ట్ర కార్యదర్శి, జాతీయ బిసి కమిషన్‌ సభ్యుడు  ఆచారి అన్నారు. నడ్డా ఎవరో తెలియదని కెటిఆర్‌ అన్నంత మాత్రాన బిజెపికి వచ్చే నష్టం లేదన్నారు. అయితే నడ్డా ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా కెటిఆర్‌కు ఉందన్నారు.  బీజేపీ ఎదుగుదలను అధికారపార్టీ జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. విద్యార్థి ఉద్యమాలు చేసి వచ్చిన వ్యక్తి నడ్డాపై కేటీఆర్‌ తన స్థాయిమరచి విమర్శలు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌లా నడ్డా అమెరికా నుంచి ఊడిపడలేదన్నారు. ఒక ప్రాం తీయ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు.. ఓ జాతీయ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేరు తెలియలేదంటే రాజకీయాల్లో ఆయన స్థానం ఏపాటిదో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నడ్డా ఎవరో అని మాట్లాడటం అధికార దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.  కల్వకుంట్ల కుటుంబానికి భజనపరులైన కొందరు మంత్రులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటే అధికార  టీఆర్‌ఎస్‌ ఎందుకు ఉలికిపడుతోందని ఆచారి  ప్రశ్నించారు. గత కొంతకాలంగా తాము పదేపదే ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణ ప్రజలకు మిషన్‌ కాకతీయ అనేకంటే.. కవిూషన్‌ కాకతీయ అంటేనే బాగా అర్థమవుతోందని ఆయన అన్నారు.గతంలో చేసిన పనులకే బిల్లులు తీసుకున్నారని 2017లో కాగ్‌ వెల్లడించింది వాస్తవం కాదా? అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నించినందుకే టీఆర్‌ఎస్‌ నేతలు
జంకుతున్నారన్నారు. కాళేశ్వరంలో అవినీతి లేకపోతే డిటేయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) లేకుండానే ఎందుకు టెండర్లకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.అవినీతిపై రుజువులు కావాలంటే..విచారణ చేయించి, నిజాయితీ చాటుకోవాలని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని ఆచారి ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని  అభివర్ణించారు.