టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కెసిఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

4

అభినందించిన నేతలు, కార్యకర్తలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి):

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ పేరును పార్టీ ప్లీనరీ వేదికగా అధికారికంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌కు 8వసారి పట్టాభిషేకం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి పార్లమెంట్‌ సభ్యుల వరకు కేసీఆర్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా పార్టీ ముఖ్యులంతా పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు గులాబీ పూల వర్షంతో పాటు పటాకులు కాల్చి సంబరాలు చేశారు. తొలుత మహిళా సభ్యులు బోకేతో కెసిఆర్‌ను అభినందించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి విజయఢంకా మోగించారు. ఆ తర్వాత అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది కావడంతో కార్యకర్తలు,నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో యాభై లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన టీఆర్‌ఎస్‌.. నియోజకవర్గానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా.. మరింత ఎక్కువగా యాభైవేల మందికి సరిపడేలా ఏర్పాట్లూ చేసింది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్తో పాటు పార్టీ నేతలు నివాళులు అర్పించారు.