టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బెంబేలెత్తతున్నాయి

– పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే పోటీకి కూడా రావనుకుంటా!
– మా మేనిఫెస్టోను కాపీకొట్టారనడం విడ్డూరం
– కోటి ఎకరాలకు సాగునీరివ్వటమే కేసీఆర్‌ ధ్యేయం
– సంక్షేమ పథకాలకే రూ.60కోట్లు కేటాయిస్తున్నాం
– దమ్ముంటే మాకంటే మెరుగైన మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రకటించాలి
– నేను పార్టీమారను.. మాకుమార్తె కాంగ్రెస్‌లో చేరదు
– నాపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కేసులేస్తా
– విలేకరుల సమావేశంలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి
వరంగల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టో పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మా మానిఫెస్టో చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయన్నారు. పాక్షిక మేనిఫెస్టోకే బెంబేలెత్తితే పూర్తి స్థాయి మేనిఫెస్టో చూస్తే ఇక పోటీకి కూడా నిలబడలేరేమో అన్నారు. ఎంపిలు సీతారం నాయక్‌, మసునూరి దయాకర్‌, తదితరులతో కలసి  కడియం శ్రీహరి హన్మకొండలో విూడియాతో మాట్లాడుతూ అధికారికంగా మా మేనిఫెస్టో ప్రకటించు కున్నాం…కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించలేదన్నారు. అలాగే తను టిఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే దివాళాకోరు మాటల బదులు ప్రజలు మెచ్చుకునే మేనిఫెస్టో కాంగ్రెస్‌ ప్రకటించుకోవాలన్నారు. విూ మేనిఫెస్టో ప్రకటించుకోకుండా విూది మేమెలా కాపీ కొడుతామని శ్రీహరి అన్నారు. మాది కాపీ కొట్టారనే మాటలు బదులు ప్రజలకు మేలు చేసే మంచి మేనిఫెస్టో ప్రకటించుకోవచ్చు కదా అన్నారు.  లక్షన్నర కోట్లలో 42వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం, తాజా మేనిఫెస్టోలో పెన్షన్లను రెట్టింపు చేస్తామని చెప్పాం, ఆసరా పెన్షన్లపై సాలీనా అదనంగా 6వేల కోట్ల భారం పడుతుందన్నారు. వచ్చే 2,3 సంవత్సరాలలో దేవాదుల, కాళేశ్వరం, పాలమూరు, సీతారామా ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కేసిఆర్‌ పనిచేస్తున్నారు. నిరుద్యోగ భృతి ద్వారా యువతకు భరోసా లభించిం దన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కులవృత్తులకు అందించిన చేయుతను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ కు అవకాశం ఇస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. మా మేనిఫెస్టోను, మా పార్టీ టిఆర్‌ఎస్‌ ని ఆశీర్వదించండన్నారు. కడియం శ్రీహరి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు. కడియం శ్రీహరి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం, కాంగ్రెస్‌ కు వెళ్లే అవకాశం లేదని ఖరాఖండిగా చెప్పారు. అలాగే  టిఆర్‌ఎస్‌ చెప్తే చేస్తుంది…కేసిఆర్‌ చెప్తే చేస్తారనే నమ్మకం ప్రజలకుందన్నారు. గత నాలుగేళ్ల పాలనే ఇందుకు నిదర్శనమన్నారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి 3016 రూపాయల వల్ల సాలీనా 4వేల కోట్ల రూపాయలు భారం మోయబోతున్నామని అన్నారు.  రైతు బంధు కింద ఎకరాకు అదనంగా 2వేల కోట్ల రూపాయల వల్ల 3వేల కోట్ల భారం అదనం కానుందన్నారు. పేద ప్రజల సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టో ప్రకటించాం.పేద వర్గాలకు పెద్దపీట వేయడం వల్లే బంగారు తెలంగాణ సాధ్యమని మేనిఫెస్టోలో వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల పంట రుణాలను ఏకకాలంలో ఏ విధంగా మాఫీ చేస్తారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని కడియం డిమాండ్‌ చేశారు.  అధికారం కోసం కక్కుర్తి పడి రైతులు, ప్రజలను మోసం చేసే విధంగా ఉండొద్దన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికలలో
మేనిఫెస్టో ప్రకటించినా వాటిని అమలు చేయలేదన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. అధికారాన్ని దోచుకోవడానికి ఉపయోగించారు తప్ప అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగించలేదన్నారు.  కాంగ్రెస్‌ నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు..కొంతమంది జైళ్లలో, కొంతమంది బెయిల్‌ పై ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టికి అవకాశం ఇస్తే…వారి అవినీతి అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. దోపిడిదొంగలంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు…కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు.