టిఆర్‌ఎస్‌ వ్యతిరేక గాలి వీస్తోంది

హావిూలు అమలు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు

కాంగ్రెస్‌దే అధికారం అన్న దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. కెసిఆర్‌ జిమ్మికులుల ఇక పనిచేయవని అన్నారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను దెబ్బతీసిన నేతగా కెసిఆర్‌ నిలిచిపోయారని అన్నారు. ఆందోల్‌లో మాట్లాడిన దామోదర రాజనర్సింహ.. టీఆర్‌ఎస్‌ పాలనపై నిప్పులు చెరిగారు. మిషన్‌ కాకతీయ అంటేనే కమిషన్‌ కాకతీయ అని విమర్శించారు. ఏకకాలంలో రుణమాఫీ అని మాఫీ చేయకకుండా నాలుగున్నరేళ్లు కాలయాపన చేసి.. ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. సింగూరు కాలువకు జలాలు తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని, తరలించుకుపోయిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని అన్నారు. ఇంటింటికి నల్లా నీరు ఇచ్చి గానీ ఓట్లు అడగబోమని అన్న టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతోందని ప్రశ్నించారు. రూ.2వేల పెన్షన్‌, పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. రూ.400 కోట్లతో జేఎన్‌టీయూ కాలేజీని ఆందోల్‌ నియోజకవర్గంలో స్థాపించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది అన్నారు. 65 సంవత్సరాలకు పెన్షన్‌ ఇచ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌ అయితే.. 58 సంవత్సరాలకే పెన్షన్‌ ఇవ్వబోతున్న పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హావిూలు అమలు చేయని వారు మళ్లీ వచ్చాక చేస్తారన్న నమ్మకం ప్రజల్లో లేదన్నారు. అందుకే టిఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తోందన్నారు.