టిడిపిని లైట్‌గా తీసుకుంటున్న బిజెపి

కేంద్ర సాయాన్ని తక్కువ చేసి చూపడంపై నేతల ఆగ్రహం
ఎన్నికల్లో బిజెపికి ఒక్క సీటయినా దక్కడం కష్టమే
అమరావతి,మార్చి14(జ‌నంసాక్షి):  విభజన సమస్యలపై  అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో నిర్ణీత కాలపరిమితిని పొందుపర్చకుండా నిర్లక్ష్యం చేసింది. ఇదే ఇప్పుడు బిజెపికి కలసి వస్తోంది. యూపిఎ స్పష్టత ఇవ్వకపోవడాన్ని ఇప్పుడు బీజేపీకి సాకుగా తీసుకుంది. పదేళ్ల సమయం ఉందన్న వాదనను తెరపైకి తెస్తోంది. దీనిని ఎపి సిఎం చంద్రబాబు కూడా తనకు అనుకూలంగా తీసుకున్నారు. సచివాలయాన్ని, అసెంబ్లీని అమరావతికి తరలించుకు పోయిన బాబు మిగతా విషయాల్లో మెలిక పెట్టారు. ఆయనకున్న ప్రయోజనాలే దీనికి కారణం. ఈ విషయంలో బిజెపి నేతలు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు.
ఎపిలో టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్రమంత్రివర్గం నుంచి వైదొలడగంతో టిడిపి ఇప్పుడు ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి సిద్దమయ్యింది. ఆయా రాష్ట్రాల్లో కొత్త మిత్రులను వెతుక్కుంటున్న తరుణంలో టిడిపి దూరమయినా ప్రధాని మోడీ లేదా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పెద్దగా స్పందించలేదు.   పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదు. సమస్యలపై చర్చకు సిద్దమని కూడా చెప్పలేదు. . టిడిపి బెదిరింపు రాజకీయాలను భరించబోమన్న సంకేతం ఇచ్చారు. దీంతో ఇప్పుడు టిడిపి,బిజెపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యింది. ఇకపోతే విభజన హావిూలకు సంబందించి లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చేయని సాయం చేస్తున్నామని అన్నారు. అయినా కేంద్ర సాయాన్ని తక్కువ చేసి చూపుతున్నారని, కావాలనే భారతీయ జనతా పార్టీని బదనామ్‌  చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌ జైట్లి చెప్పిన విషయాలను సరిగా అవగాహన చేసుకోలేదని  అంటున్నారు. ప్రత్యేక ¬దా కన్న ప్యాకేజీ మంచిదని భావించామని అన్నారు.కేంద్రం ఎప్పుడూ ఎపికి సహకరించలేదని చెప్పలేదని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 2500 కోట్లు ఇవ్వడం జరిగిందని, కేంద్ర విద్యా సంస్థలకు నిధులు ఇచ్చారని,పోలవరం
ప్రాజెక్టుకు కేంద్రం నిదులు ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రే చెప్పారని అంటున్నారు. అంతేగాకుండా కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి గుంటూరు,విజయవాడ ప్రాంతంలో రాజధానికి ఎంత ఖర్చు చేశారో చూపాలన్నారు. ఎవరు ఎవరితో లాభపడ్డారో ప్రజలకు తెలుసునని కూడా అంటున్నారు. మొత్తంగా ఎపి వ్యవహారాలను  బిజెపి పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. చంద్రబాబు రాజకీయాలను సహించేది లేదన్నట్లుగా కూడా ఉంటోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. దక్షిణాదిలో పటిష్టం కావాలని అనుకుంటున్న వేళ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రానిధ్యం లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్కోస్థానం కూడా గెల్చుకుంటామన్న ధీమా లేదు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి మెరుగు పడకపోగా దిగజారిందనే చెప్పాలి.