టిడిపిలో కొణతాల చేరేందుకు రంగం సిద్దం

28న బాబుతో భేటీ
అమరావతి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కొణతాల కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం
ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీలో చేరాక ఆయన అనకాపల్లి పార్లమెంటు సీటు అడిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అవంతి శ్రీనివాస్‌ వైకాపాలో చేరడ్తో కొణతాలకు లైన్‌ క్లీయర్‌ అయ్యిందని అంటున్నారు. మరోవైపు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాల నుంచి తెదేపా ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని నిలిపితే బాగుంటుందన్న అంశాలపై ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఎవరైతే బాగుంటుంది, గట్టి పోటీ ఇవ్వగలవారు ఎవరు? విజయావకాశాలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణెళిష్‌కుమార్‌, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు సమావేశమయ్యారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థుల కోసం అంతర్గతంగా చర్చించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 26న అమరావతిలో ముఖ్యమంత్రితో జరిగే ప్రాథమిక సమావేశానికి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు హాజరుకానున్నారు.  అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక సమావేశాన్ని సీఎం చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అరకు సమావేశాలు మంగళవారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాకు చెందిన తెదేపా శాసనసభ్యులకు సమాచారం అందగా సోమవారమే అంతా బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించి జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించాలనుకుంటున్న తరుణంలో అన్ని స్థానాల్లో
తప్పకుండా గెలిచే వ్యక్తులను నిలబెట్టాలనే యోచనలో సీఎం ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నాయకులు ముందుగానే సమావేశమై ఎవరుంటే బాగుంటుందనే అంశాలపై చర్చించుకున్నారు. విశాఖ ఎంపీ స్థానం కాపులకు కేటాయిస్తే, అనకాపల్లి ఎంపీ స్థానం బీసీలకు, అనకాపల్లి ఎంపీ స్థానం కాపులకు ఇస్తే, విశాఖ స్థానం బీసీలకు కేటాయించాలని చర్చించుకున్నారు. కాపులకు కేటాయించే ఎంపీ స్థానం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు బరిలోకి దిగితే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా దీనికి ఆయన ఆసక్తి చూపలేదు. దీనిపై మంత్రి స్పందిస్తూ తనకు ఎంపీగా పోటీచేయాలని ఆసక్తి లేదని, భీమిలి  నుంచే పోటీ చేస్తానని, ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలోనూ అదే విషయం చెబుతానని పేర్కొన్నట్లు తెలిసింది.  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పార్టీలోకి రానుండటంతో ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందా అన్న అంశంపై కూడా వీరిమధ్య చర్చకు వచ్చింది.