టిడిపి నుంచి వచ్చిన వారికి పెద్దపీట

రేవంత్‌ వర్గంలో నలుగురికి టిక్కెట్లు

పెండింగ్‌లో అరికెల నర్సారెడ్డి సీటు

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రేవంత్‌ రెడ్డి టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరడమే గాకుండా పార్టీలో గట్టి పట్టు సాధించారు. టిడిపి నుంచి వచ్చిన వారిలో నలుగురికి టిక్కెట్లు దక్కాయి. నిజామబాద్‌ అర్బన్‌లో అరికెల నర్సారెడ్డికి టిక్కెట్‌ వస్తుందని అంతా భావించారు. అయితే ఆ సీటును పెండింగ్‌లో పెట్టారు. ఇక, రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన అరికెల నర్సారెడ్డి భవితవ్యం పెండింగ్‌లో పడింది. ఆయన ఆశిస్తున్న నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థిని తొలి జాబితాలో ప్రకటించలేదు. మొత్తంగా కాంగ్రెస్‌ తొలి జాబితాలో రేవంత్‌ రెడ్డి వర్గానికి నాలుగు సీట్లు దక్కాయి. కొడంగల్‌ నుంచి రేవంత్‌ టిక్కెట్‌ ఖరారు కాగా ములుగు నుంచి సీతక్క, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, పెద్దపల్లి నుంచి విజయ రమణారావులకు టికెట్లు కేటాయించారు. వీరు టిడిపి నుంచి రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరారు. ఇకపోతే ములుగులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి అజ్మీరా చందూలాల్‌ను సీతక్క ఢీకొనబోతున్నారు. లంబాడా సామాజిక వర్గానికి చెందిన

చందూలాల్‌ గత ఎన్నికల్లో తెలంగాణ ఊపులో గెలిచారు. అయితే అక్కడ ఆదివాసీ ఓటర్లే ఎక్కువ. అదే వర్గానికి చెందిన సీతక్క, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇక్కడి నుంచి పోటీ పడ్డారు. దాంతో ములుగు టికెట్‌ను సీతక్కకు ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. భద్రాచలం నుంచి పోడెం వీరయ్యకు అవకాశం ఇచ్చింది. భద్రాచలం కూడా ఎస్టీ రిజర్వ్‌ టిక్కెట్‌ కావడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇక, చొప్పదండిలో సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన మేడిపల్లి సత్యం, నాగి శేఖర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడినా.. సత్యంకే అవకాశం దక్కింది. అయితే, సూర్యాపేట నుంచి మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డితోపాటు రేవంత్‌తో పార్టీలో చేరిన పటేల్‌ రమేశ్‌ రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ దామోదర్‌రెడ్డికే టికెట్‌ ఇచ్చారు. అలాగే, స్టేషన్‌ ఘన్‌పూర్‌ రేవంత్‌ వర్గానికి చెందిన దొమ్మాటి సాంబయ్య టికెట్‌ ఆశించారు. కానీ, ఆయనను పక్కనబెట్టి ఇందిరకే టికెట్‌ ఇచ్చారు. ఇకపోతే పరకాలలో అనుకున్నట్లుగానే కొండాసురేఖకు టిక్కెట్‌ దక్కింది. దీంతో ఆమె ఉత్సాహంగా ఉన్నారు. భూపాలపల్లి నుంచి కూతురి కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.