టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మా లక్ష్యం

– కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు 
– అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుంది
– పొత్తులతో కోదండరాంతో చర్చిస్తాం
– రైతు బంధు పథకం భూస్వాములకోసం అన్నట్లుగా ఉంది
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

కరీంనగర్‌, మే14(జ‌నం సాక్షి) : 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ అన్ని స్థానాల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌  పోటీచేస్తుందని పేర్కొన్నారు. పొత్తులపై తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధక్షుడు కోదండరాంతో చర్చలు జరుపుతామని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు పథకం..రైతుల కోసమా?, భూస్వాముల కోసమా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. కేవలం పెద్ద రైతులకు మాత్రమే ఈ విధానం వల్ల అధిక లబ్ధి జరుగుతుందన్నారు. కేవలం 10 ఎకరాల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుండేదని తమ్మినేని అభిప్రాయ పడ్డారు. రైతుబంధు పథకంతో కౌలురైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతుబంధను కౌలు రైతులకు అప్పగించ క పోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకొని సాగుచేసేవారిలో సన్న, చిన్నకారు రైతులే ఉంటారని, వారిని విస్మరించి ప్రభుత్వం కేవలం ధనిక రైతులకు మేలు చేయడం సబబుకాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాలన సాగిస్తుందని, దీని వల్ల దేశం మతాల వారీగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తమ్మినేని హెచ్చరించారు.
—————————-