టీకాలకు అనుమతి

– కోవాగ్జిన్‌,కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అత్యవసర అనుమతి

– స్వాగతించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

– కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు : ప్రధాని మోదీ

దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ నుంచి ఈ ప్రకటన రావడం ఊరట కల్పించే అంశం.అంతకుముందు ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) సిఫార్సు చేసింది. దానికనుగుణంగా నేడు డీసీజీఐ తుది అనుమతులను జారీ చేసింది. టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు బ్రిటన్‌ ప్రభుత్వం డిసెంబరు 30నే అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సమాచారాన్ని సీరం సంస్థ.. నిపుణుల కమిటీకి సమర్పించింది. భారత్‌లోనూ ఈ సంస్థ 1600 మంది 18ఏళ్ల పైబడిన వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు డీసీజీఐ అనుమతినిచ్చింది. ఈ టీకా 70.42 శాతం సామర్థ్యం చూపినట్లు వివరించింది. భద్రత, రోగనిరోధకత పెంచే విషయంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు సీడీఎస్‌సీవో అంగీకరించిన నేపథ్యంలో దాని అత్యవసర వినియోగ అనుమతులకు మార్గం సుగమమైంది. ఇక కొవాగ్జిన్‌ విషయానికి వస్తే తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించినట్లు డీసీజీఐ తెలిపింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దాదాపు 23 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. కొవాగ్జిన్‌ టీకా భద్రమైనదని స్పష్టం చేసింది. ఇక జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా తొలి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ 1000 మందిపై కొనసాగుతున్నట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్‌ సురక్షితమైనదేనని తెలిపింది. దీన్ని మూడు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ఫేజ్‌-3 ట్రయల్స్‌కు అనుమతి కోరినట్లు తెలిపింది.

సీరం శ్రమ ఫలించింది..

”అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వ్యాక్సిన్‌ తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్‌ తీసుకున్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కిందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు.భారత్‌లో తొలి కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ వినియోగానికి అనుమతి లభించిందని, సురక్షితమైన, సమర్థవంతమైన ఈ టీకా రానున్న కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుందని అన్నారు

కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు: మోదీ

భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌పై యద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ప్రధాని స్పందించారు. ఈ నిర్ణయం భారత్‌ ఆరోగ్యవంతమైన కొవిడ్‌ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందని అన్నారు. దేశప్రజలకు, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కృషి చేసి శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌లోనే తయారు కావడం గర్వకారణమని ప్రధాని అన్నారు. భారత శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేసేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు ఈ ఘటన ఉదాహరణ అని పేర్కొన్నారు. ”మన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మిగిలిన కరోనా వారియర్స్‌ దేశ కష్టకాలంలో చేసిన సేవలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మనందరం వారికి రుణపడి ఉంటాం” అని మోదీ ట్వీట్‌ చేశారు.భారత్‌లో కరోనా టీకాకు అనుమతులు రావడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్వాగతించింది. సంస్థ ఆగ్నేయాసియా వ్యవహారాల ప్రతినిధి పూనమ్‌ కేత్రపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌పై ప్రపంచం చేస్తున్న పోరును ఈ చర్య మరింత వేగవంతం చేసిందని వ్యాఖ్యానించారు. కాగా కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇస్తున్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌లకు అనుమతిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కట్టడిని ఉద్ధృతం చేయడంలో భారత్‌ నిర్ణయం దోహదపడుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ కేత్రాపాల్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రాధాన్యత కలిగిన ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడం, ప్రజారోగ్య రక్షణ చర్యలు, ప్రజల భాగస్వామ్యాన్ని నిరంతరం అమలు చేయడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.