టీడీపీ సీనియర్‌ నేత బ్రహ్మయ్య మృతి

– గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి
– రాజంపేట నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే
కడప,అగస్టు21 (జనంసాక్షి) : తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కుటుంబసభ్యులు హుటాహుటీన స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించాలని అక్కడ వైద్యులు సూచించారు. దీంతో పసుపులేటి బ్రహ్మయ్యను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ శివార్లలోని ఓ ఆసుపత్రికి బ్రహ్మయ్యను తరలించగా, అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. బ్రహ్మయ్య మృతి పట్ల టీడీపీ నేతలు, శ్రేణులు సంతాపాన్ని వెలిబుచ్చాయి. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలోనే బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన రమేష్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. కడప జిల్లాకు చెందిన బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశించారు.
కాగా, 1994 ఎన్నికల్లో తొలిసారిగా రాజంపేట నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచి, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2004 ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి ఓటమి చవిచూశారు. కడప జిల్లా రాజంపేటలో 1956 జనవరి 13న జన్మించిన బ్రహ్మయ్య బీకాం పూర్తిచేసి, ఓ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో బిజినెస్‌ మేనేజర్‌గా చేరి ఆ సంస్థకు రీజినల్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఆ సంస్థలో సేవలకు ఆయన నాటి రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ చేతుల విూదుగా సేవా రత్న అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు.