టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

అధికారులకు కలెక్టర్‌ సూచన

జగిత్యాల,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు టెన్త్‌ ఉత్తీర్ణతలో ముందుండాలని కలెక్టర్‌ వరత్‌ అన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో మంచిఫలితాలు రాబట్టాలని డిఇవోకు సూచించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారనీ, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారనీ, విద్యార్థులు ఇంటికి ఎప్పుడు వస్తున్నారని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మూడుసార్లు ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు.జిల్లాలో ఉత్తేజం కార్యక్ర మం మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్నామనీ, పదో తరగతి విద్యార్థులకు స్కూల్‌ ప్రారంభానికి ఒక గంట ముందు, స్కూల్‌ అనంతరం ఒక గంట ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారనీ, దీని కోసం విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తు న్నారని తెలిపారు. ఉత్తేజం కార్యక్రమానికి కావాల్సిన డబ్బును దాతల నుంచి లేదా విద్యార్థుల తల్లిదండ్రులైనా ఇవ్వవచ్చని తెలిపారు. ప్రతి పాఠశాలలో ప్రణాళికా ప్రకారం విద్యార్థులకు విద్యనందించడంతోపాటు దాతలు ఇచ్చిన డబ్బు బ్యాంక్‌లో జమ చేసి విద్యార్థులకు మాత్రమే ఖర్చు చేస్తారని తెలిపారు.