టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఏలూరు,మార్చి14(జ‌నంసాక్షి): ఈనెల 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ఈనెల 18 నుంచి ఎప్రిల్‌ 2తేదీ వరకు నిర్వహిస్తారు.  జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సమస్యాత్మక  కేంద్రాలుగా గుర్తించామని, వాటిలో సీసీ కెమేరాలు ఏర్పాటుచేసినట్లు డీఈఓ వివరించారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికంటే 45 నిమిషాల
ముందుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమిస్తున్నట్టు తెలిపారు.  పరీక్షల్లో చూసిరాతల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. ఏవిధమైన చూసిరాతలకు పాల్పడినా డిబార్‌ చేస్తామన్నారు. చూసిరాతలను ప్రోత్సహించే ఇన్విజిలేటర్లపై చట్టం ప్రకారం చర్యలుంటాయని పేర్కొన్నారు.  పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో కంట్రోలు రూమును ఏలూరులోని డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ మేనేజరు  ఒక ప్రకటనతో తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌ను చూపిస్తే వారి ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈనెల 18 నుంచి 2వ తేదీ వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సును ఎక్కాల్సి వస్తే హాల్‌ టికెట్‌, బస్‌ పాస్‌లను కండక్టరుకు చూపించి కాంటినేషన్‌ టికెట్‌ ధరతో ప్రయాణించవచ్చని సూచించారు.