ట్యాబ్‌ల వినియోగంతో సత్ఫలితాలు  

క్షేత్రస్థాయిలో సులువుగా మారిన వివరాల సేకరణ
మెదక్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం కోసం పంపిణీ చేసిన ట్యాబ్‌ల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. గ్రామంలో నెలకొన్న ఏ సంఘటనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. గ్రామ రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగాసమర్థవంతంగా నిర్వహించడం… భూమిశిస్తు, ఇతర బకాయిలను వసూలు చేయడం గ్రామ రెవెన్యూ అధికారి  బాధ్యత. గతంలో ఆయా అంశాలకు సంబంధించి కాగితాల రూపంలో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చేవారు. ఇప్పుడు ట్యాబ్‌ల పంపిణీతో రోజువారీగా సమస్యలను తెలుసుకునే వీలు కలిగింది. అలాగే విఆర్వోలకు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఆయా ప్రభుత్వ శాఖల్లో శాస్త్రసాంకేతికతను వినియోగిస్తూ క్షణాల్లో నివేదికలను తెప్పిస్తుండగా, కీలకమైన రెవెన్యూశాఖలో కాగితం రూపంలో నివేదికలు ఉండేవి. నివేదికలు సిద్ధం కావడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. ఇందుకు స్వస్తి పలికి క్షణాల్లో సమాచారం అందజేసేందుకుగాను ప్రభుత్వం వీఆర్వోలకు ట్యాబ్‌లను పంపిణీ చేసింది. సమాచారాన్ని సేకరించి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంలో ట్యాబ్‌ల వల్ల ఇబ్బందులు తొలిగాయి. గ్రామస్థాయిలో ఎండిన పంట, ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన వివరాలు, కరవు వివరాలతో పాటు రెవెన్యూకు సంబంధించి ప్రతి అంశాన్ని సేకరిస్తారు. వాటి నమోదు కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో డేటా కంప్యూటర్‌ ఆపరేటర్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఒకే సారి మండలంలోని వీఆర్వోలు సేకరించిన సమాచారం నమోదు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ట్యాబ్‌లో నాలుగు యాప్‌లను పొందుపరిచి వివరాల సేకరణకు సులువు చేశారు.  అందులో పట్టాదారు, ఆధార్‌ సంఖ్య సీడింగ్‌, ఈ-అజమాయిషీ, మా భూమి, ప్రాథమిక సమాచర నివేదిక యాప్‌లు ఉన్నాయి. ఇందులో పట్టాదారు ఆధార్‌సంఖ్య సీడింగ్‌ చేయడం వల్ల ఎంత భూమి, ఎక్కడ ఉంది అనే వివరాలు తెలుస్తాయి.  ఏ పంట వేశారు.. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వివరాలతోపాటు పంట చిత్రాన్ని వీఆర్వోలు అప్‌లోడ్‌ చేయాలి. మాభూమిలో భూమి రికార్డుల వివరాలు పహాణిలో చూపించే విధంగా భూముల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే పీఐఎస్‌లో ఛాయచిత్రంతో ఆప్‌లోడ్‌ చేసి వివరాలు పొందుపర్చాలి. ఎప్పటికప్పుడు పొందుపరిచిన సమాచారం సీసీఎల్‌ఏకు వెళ్తుంది. గ్రామాల్లో నెట్‌  సౌకర్యం లేకున్నా ఆఫ్‌లైన్‌లో వివరాలను నమోదు చేసి, నెట్‌ఉన్న చోటకు వచ్చి అప్‌లోడ్‌ చేసే సౌకర్యం కల్పించారు. గత నెలరోజులుగా వీరు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి కలెక్టర్‌ కార్యాలయానికి నివేదిస్తున్నారు.