ట్రాన్స్కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి

axqlnlcsహైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 : విద్యుత్‌ శాఖ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు శ్యాంసుందర్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేస్తోంది. నగరంలోని సరస్వతినగర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరించారు. లెక్కకు మించి ఆదాయాన్ని సమకూర్చినట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.30 కోట్లు విలువ చేసే ఆస్తులను ఉన్నట్లు గుర్తించారు.
సరస్వతి నగర్‌లో ఓ భవనం, కూకట్‌పల్లిలో రెండు అంతస్థుల భవనం, నేరేడ్‌మెట్‌, కొంపల్లి, బోడుప్పల్‌, పోరుమావిళ్లలో ఇళ్ల స్థలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా దాసుమోలిలో రెండు ఎకరాల పొలం, కృష్ణా జిల్లా నందిగామలో స్థలం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల్లో కొన్ని ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.