ట్రాఫిక్‌ నిబంధనలతో భారీగా జరిమానాలు

కోటిన్నరకు పైగా వసూళ్లు
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : కొత్త ట్రాఫిక్‌ నిబంధనల చట్టం అమలులోకి వచ్చిన తొలి నాలుగు రోజుల్లోనే హర్యానా, ఒడిశా రాష్టాల్రకు చెందిన ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ల ద్వారా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి రూ. 1.41 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించారు. సెప్టెంబర్‌ 1 నుంచి
ఈ కొత్త మోటార్‌ వెహికల్స్‌(సవరణ) బిల్లు, 2019 దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఇది అమలులోకి వచ్చిన తొలి నాలుగు రోజుల్లో ఒడిశా మోటారు వాహనాల శాఖ మొత్తం 4,080 చలాన్లను ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు జారీచేసి రూ. 88.90 లక్షలు వసూలు చేసింది. ఇవిగాక మొత్తం 46 వాహనాలను సీజ్‌ చేసింది. ఇక హర్యానాలో మొత్తం 343 చలాన్లను జారీ చేసి రూ.52.32 లక్షలు వసూలు చేశారు. ఢిల్లీలో మొదటి రోజే ట్రాఫిక్‌ పోలీసులు 3,900 చలాన్లు జారీచేశారు. ఇకపోతే బెంగళూరులో కూడా భారీగానే జరిమానాలు వసూలు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా 30లక్షల రూపాయల జరిమానా వసూలు చేశామని నగర పోలీస్‌కమిషనర్‌ భాస్కర్‌రావు తెలిపారు.నగరంలో కొత్త ట్రాఫిక్‌ చట్టం ఈ నెల 3న అమలులోకి వచ్చిందని బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం 1 గంట లోగా 30 లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన మేరకు 1518 కేసులు నమోదు చేసి రూ.15.18 లక్షలు, పిలియన్‌ రైడర్‌కు హెల్మెట్‌ లేకపోవడంపై 1121 కేసులు నమోదు చేసి 11.21 లక్షలు వసూలు చేశామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన మేరకు 10 వేల రూపాయల జరిమానా ఉంటుందన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ఇతరులకు సహకారం అందించిన వారవుతారన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో లక్షలాదిమంది మృత్యువాతపడుతున్నందున సరికొత్తచట్టాన్ని అమలులోకి తెచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చిన కొత్త ట్రాఫిక్‌ చట్టానికి అనుగుణంగా ప్రజలు వ్యవహరించాల్సిందేనని నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు వెల్లడించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని గడచిన దశాబ్ద కాలంలో లక్షలాది మంది అర్థాంతరంగా మృత్యువాత పడుతున్నందున సరికొత్తచట్టాన్ని అమలులోకి తెచ్చారన్నారు. ప్రధానంగా మద్యపానం సేవించడం ద్వారా ప్రమాదాలు తీవ్రం అవుతున్నాయన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, వన్‌వేలో ప్రయాణించడం వంటి వాటిపై సమగ్రంగా పరిశీనలు ఇకపై కొనసాగుతాయని నగర కమిషనర్‌ భాస్కర్‌ రావు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించిన విషయంలో అనవసరంగా వాగ్వాదానికి దిగితే 353 సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. బాడీఫోన్‌ కెమరాలను 600 మంది ట్రాఫిక్‌ పోలీసులకు కేటాయిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌లో 10 సెకెన్లు ఇబ్బంది కల్గించినా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే 150 వాహనాలపై బెంగళూరులో ప్రభావం చూపుతుందన్నారు. అన్ని విద్యాసంస్థల్లోనూ అవగాహనా సదస్సును ఏర్పాటు చేయదలచామని ఈ మేరకు బీబీఎంపీకి లేఖలు పంపుతున్నామని పార్కింగ్‌ స్థలాలు సక్రమంగా పర్యవేక్షించాలని సూచిస్తామన్నారు.
ట్రాఫిక్‌ చలానా: బైకు దగ్ధం
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి  జరిమానాలు విధిస్తున్న కారణంగాఢిల్లీకి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడికి అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న వాహనదారుడు తన బైక్‌కు నిప్పు పెట్టారు. బైక్‌ పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. వాహనదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.