డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో ఆందోళన

విూచెత్త మాకు వద్దంటూ నిరసనలు
గుంటూరు,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా సతైనపల్లిలోని భీమవరంలో రైతుల పక్షంగా చేపట్టిన ఆందోళనలో సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సతైనపల్లి పట్టణంలో 27, 28, 29 వార్డుల్లో ఉన్న డంపింగ్‌ యార్డును భీమవరం శివారులో ఉన్న ప్రభుత్వ పోరంబోకు స్థలంలోకి తరలించడాన్ని నిరసిస్తూ.. సిపిఎం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు.  విూ చెత్త మాకు వద్దు  అంటూ.. పంట పొలాలను కాపాడాలని ప్ల కార్డులతో నినాదాలు చేశారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌ స్పందించకపోవటంతో.. తాలూకా సెంటర్లలో రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. సిపిఎం పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి గద్దె చలమయ్య మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డు ఏర్పాటు వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. పట్టణంలో సేకరించిన వ్యర్థాలను గ్రామాలకు తరలించటం ఏమిటని ప్రశ్నించారు. డంపింగ్‌ యార్డు వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని, పంట పొలాలకు నష్టం వాటిల్లటంతో పాటు భూ గర్భజలాలు కలుషితమవుతున్నాయని చెప్పారు. అధికారులు స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరించే వరుకు రాస్తారోకో విరమించేది లేదని స్పష్టం చేశారు. సిపిఎం నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్‌ పోలీస్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. తహశీల్దార్‌ శ్రీనివాసరావు గ్రామస్తులతో చర్చించారు. రేపు స్థలాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తానని హవిూ ఇచ్చారు. సిపిఎం మండల కార్వదర్శి పెండాల మహేష్‌, జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయ నాయక్‌, వంకారలపాటి రాణి, చింతపల్లి మల్లేశ్వరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.