డబ్బులిస్తానంటే.. బ్యాంకులెందుకు తీసుకోవటం లేదు?

–  కర్ణాటక హైకోర్టు ఎదుట సమస్యను పరిష్కరిద్దామని చెప్పారు
– డబ్బును రికవరీ చేసిన పూర్తి క్రెడిట్‌ మోదీ తీసుకోవచ్చుగా
– ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించిన విజయ మాల్యా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి14(జ‌నంసాక్షి) : అందుబాటులో ఉన్న తన డబ్బును తీసుకోమని బ్యాంకులకు ప్రధాని మోదీ ఎందుకు సూచించడం లేదని లిక్కర్‌ బ్యారన్‌ విజయ్‌ మాల్యా ప్రశ్నించారు. బుధవారం లోక్‌ సభలో మోదీ మాట్లాడుతూ, విజయ్‌ మాల్యాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రూ. 9వేల కోట్లతో ఒక వ్యక్తి విదేశాలకు చెక్కేశారంటూ మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్‌ ద్వారా గురువారం మాల్యా స్పందించారు. పార్లమెంటులో ప్రధాని ప్రసంగం నా దృష్టికి వచ్చింది. ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. రూ. 9వేల కోట్లతో ఒక వ్యక్తి విదేశాలకు చెక్కేశారని మోదీ అన్నారు. అది నన్ను ఉద్దేశించి అన్నదనే విషయం నాకు తెలుసు. మోదీని ఎంతో గౌరవంతో ఒక విషయం అడుగుతున్నా. టేబుల్‌ పై నేను ఉంచిన డబ్బును తీసుకోవాలని బ్యాంకులకు మోదీ ఎందుకు సూచించడం లేదని ప్రశ్నించారు. కింగ్‌ ఫిషర్‌ కు ఇచ్చిన అప్పులను రికవర్‌ చేసిన పూర్తి క్రెడిట్‌ ను మోదీ తీసుకోవచ్చుకదా అన్నారు. కర్ణాటక హైకోర్టు ఎదుట సమస్యను పరిష్కరించుకుందామని నేను చెప్పాను. నా ఆఫర్‌ ను పనికిమాలిన చర్యగా పక్కన పెట్టకూడదు. ఎంతో నిబద్ధతతో, నిజాయతీతో నేను ఈ ఆఫర్‌ ఇచ్చాను. నా డబ్బును బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదంటూ అంటూ ట్విట్టర్‌ ద్వారా మాల్యా స్పందించారు. తాను అక్రమంగా ఆస్తులు దాచుకున్నట్టు ఈడీ చెబుతున్న విషయం విూడియా ద్వారా తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యానని విజయ్‌ మాల్యా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ దాచిన సొమ్ము అంటూ ఏదైనా ఉంటే రూ.14 వేల కోట్ల ఆస్తులను నేను బహిరంగంగా కోర్టు ముందు ఎందుకు పెడతాను? ప్రజలను ఇలా తప్పుదోవ
పట్టించడం సిగ్గుచేటు. అయినా నాకిది పెద్ద ఆశ్చర్యమేవిూ కలిగించలేదని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో అమల్లోకి తెచ్చిన పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద… ‘పరారీ ఆర్థిక నేరగాడి’ (ఎఫ్‌ఈవో)గా ముద్రపడిన తొలి వ్యక్తి విజయ్‌ మాల్యా కావడం విశేషం. రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేతపై విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన 2016 మార్చి 2న దేశం విడిచి లండన్‌ పారిపోయారు.