డబ్బు కోసమే దీక్షిత్‌ హత్య

– వెల్లడించిన ఎస్పీ కోటి రెడ్డి

మహబూబాబాద్‌ బ్యూరో, అక్టోబరు 23(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) కిడ్నాప్‌, హత్య కేసులో నిందితుడిని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి విూడియా ఎదుట హాజరుపరిచారు. దర్యాప్తులో తేలిన వివరాలను విూడియాకు వివరించారు. నిందితుడు దీక్షిత్‌ను ఆదివారమే కిడ్నాప్‌ చేసి, హత్యకు పాల్పడ్డాడని కోటిరెడ్డి తెలిపారు. తెలిసిన వాళ్లే కిడ్నాప్‌ చేసి ఉంటారన్న కోణంలోనే విచారణ చేపట్టామన్నారు. నిందితుడు సాగర్‌ స్థానికుడు కావడంతో సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అతడికి సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. కిరాణా, ఔషధ దుకాణాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించామని, రాత్రిపూట కావడంతో దృశ్యాలు సరిగా కనిపించలేదని ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.ఎస్పీ కోటి రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు దీక్షిత్‌ను నిందితుడు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. కేసముద్రం మండలం అన్నారం వద్ద దానమయ్య గుట్టలపైకి తీసుకెళ్లాడు. బాలుడు భయంగా ఉందని చెబితే తన వద్ద మాత్రలు ఉన్నాయని చెప్పాడు. బాలుడు ఇంటికి తీసుకుపోవాలని ఏడవడంతో నిద్రమాత్రలు ఇచ్చాడు. స్పృహతప్పిన తర్వాత చేతులు కట్టేసి టీషర్ట్‌తో మెడకు బిగించి హత్య చేశాడు. తిరిగి మహబూబాబాద్‌ వచ్చి పెట్రోల్‌ తీసుకొని వెళ్లి మృతదేహాన్ని తగులబెట్టాడు.డబ్బు సంపాదించాలన్న దురాశతో మంద సాగర్‌ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. కిడ్నాప్‌ చేసిన రెండు గంటల్లోనే చంపడం వల్ల బాలుడిని కాపాడలేకపోయామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.నిందితుడిని ఇవాళ రిమాండ్‌కు తరలిస్తామన్నారు.

డబ్బు కోసమే హత్య: ఎస్పీ కోటి రెడ్డి

కేసును త్వరగా ఛేదించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. హాంకాంగ్‌, అమెరికా నుంచి జనరేట్‌ అయి వచ్చినట్లు కాల్స్‌ వచ్చాయని, ఆ ఐపీ అడ్రస్‌లతో ఏ అప్లికేషన్‌ ఎక్కువగా వాడుతున్నారో పరిశీలించామని, ఇంటర్‌లింక్‌ చేసి పరిశీలించి మూడు రోజుల్లో నిందితుడిని గుర్తించామని అన్నారు. మహబూబాబాద్లో 500 నుంచి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.