డిఎంకెను దూరం పెడితే కాంగ్రెస్‌తో జత కడతా

2019 ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి సిద్ధం: కమలహాసన్‌
చెన్నై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ప్రముఖ నటుడు, మక్కళ్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ… ద్రవిడ మున్నెట్ర కళగమ్‌(డీఎంకే)తో దూరం జరిగితేనే దాని గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఈ ఫిబ్రవరిలో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన శుక్రవారం తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను పంచుకున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేకు దూరం జరిగితే 2019 ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా పొత్తు తమిళనాడు ప్రజలకు తప్పకుండా మేలు చేస్తుంది’ అని వెల్లడించారు. కాంగ్రెస్‌ వైపు కమల్‌ చూపు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. జూన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కమల్‌ సమావేశమయ్యారు. ఆ సమయంలో వారిద్దరూ రాష్ట్రంలోని రాజకీయాలు గురించి చర్చించారు.
‘మేము పలు రాజకీయ అంశాలను చర్చించాం. కానీ, విూరు ఆలోచిస్తున్నట్లుగా మాత్రం కాదు’ అని సమావేశానంతరం విూడియాతో వెల్లడించారు. అయితే ఇలా డీఎంకే పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. కావేరీ అంశం గురించి కమల్‌ ప్రతిపాదించిన అఖిల పక్ష సమావేశాన్ని డీఎంకే, దాని మిత్రపక్షాలు పెద్దగా పట్టించుకోలేదు. ‘ఎంఎన్‌ఎం అవినీతి విూద పోరాటం చేసే లక్ష్యంతో ఏర్పడింది. ఆ పార్టీలతో ఎప్పటికీ చేతులు కలపదు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు రెండూ అవినీతిమయంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలను తమిళనాడు నుంచి తరిమేయడానికి గట్టి ప్రయత్నం
చేస్తాం’ అని కమల్‌ హాసన్‌ వెల్లడించాడు. అలాగే సినిమాలకు దూరంగా ఉంటానని గతంలో ఆయన ప్రకటించారు. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం ‘క్షత్రియ పుత్రుడు’కు సీక్వెల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 1992లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.