ఢిల్లీ ట్వంటీకి విద్యుత్‌ చిక్కులు

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): విద్యుత్‌ కొరత క్రికెట్‌ మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య నవంబరు 1న జరగబోయే తొలి టీ20కి దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్లడ్‌లైట్స్‌ వెలుగులో జరగాల్సి ఉంది. సాధారణంగా రాత్రి మ్యాచ్‌ జరిగే సందర్భంలో నిరంతర విద్యుత్తు కోసం దిల్లీ అండ్‌ డిస్టిక్ర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) ఐదు డీజిల్‌ జనరేటర్లను సిద్ధం చేస్తోంది. నవంబరు 1న మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ బోర్డు(ఈపీసీఏ) డీడీసీఏకు లేఖ రాసింది. మ్యాచ్‌కు డీజిల్‌ జనరేటర్లు వాడొద్దని, ప్రత్నామ్నాయాలు చూసుకోవాలని అందులో కోరింది.

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం పడగవిప్పుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అక్టోబరు 17 నుంచి 2018 మార్చి 15 వరకు దిల్లీలో డీజిల్‌ జనరేటర్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దిల్లీ విద్యుత్తు బోర్డు, డిస్కం అధికారులతో డీడీసీఏ నిర్వాహకులు చర్చలు జరిపారు. నిరంతర విద్యుత్తు కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని.. వాటిని మ్యాచ్‌ ముగిసిన 24 గంటల్లో తొలగిస్తామని తెలిపింది. దీనికి విద్యుత్తు అధికారుల నుంచి పాజిటివ్‌గానే సమధానం వచ్చినట్లు తెలుస్తోంది.