తగ్గిన పత్తి దిగుబడులు

ఆందోళనలో రైతులు

ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత కాత రాలిపోయింది. తలమడుగు, తాంసీ, జైనథ్‌, బేల, ఆదిలాబాద్‌ మండలాల్లో గులాబీ

పురుగు ఆశించిడంతో పూత దశలోనే మాడిపోయింది. పిందెలకు కూడా రంధ్రాలు చేయడంతో పనికి రాకుండాపోయింది. దీంతో దిగుబడులపైన రైతులు తీవ్ర నష్టాల బారినపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు గులాబీరంగు పురుగు ఆశించడంతో దెబ్బవిూద దెబ్బతో కోలుకోలేకపోతున్నారు. సగానికి సగం దిగుబడులు తగ్గిపొవడంతో అన్నదాతల అంచనాలు తారుమారయ్యాయి. వీటికి తోడు మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలం కారణంగా కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందని దుస్థితి నెలకొంది. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా సోయా పంటను సాగు చేయాలని ప్రభుత్వ ప్రచారంతో సాగు విస్తీర్ణం తగ్గింది. పత్తి సాగు చేసిన పత్తి రైతులు ప్రస్తుతం తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి హెక్టారుకు పది క్వింటాళ్లు కూడా దిగుబడి రావడంలేదు. దీంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. పత్తి పంట దిగుబడులు తగ్గిపోవడంతో మార్కెట్లకు వచ్చే పంట కూడా తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి మార్కెట్లకు భారీగా పత్తి దిగుబడి వచ్చింది. కానీ.. ఈసారి ఆ పరిస్థితులు

అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని అయిదు మార్కెట్‌ యార్డులో వచ్చిన పత్తిన చూస్తే దిగుబడులుఎలా ఉన్నాయో తెలిసిపోతోంది. ఈ మొత్తం పత్తిని ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెంటాడినా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉంటాయనే ఎదురుచూస్తున్నారు. నీటి వనరులున్న చోట రైతులకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి ఉన్న పూత, కాత రాలిపోయింది. దీంతో అప్పటి నుంచి పత్తికి పూత, కాత లేకుండాపోయింది. ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అనుకుంటే నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.