తడిసిన ధాన్యం ఆరబెట్టిన తరవాత కొనుగోళ్లు

నిర్మల్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ధాన్యం తడిసినా ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించామని జిల్లా సంయుక్త పాలనాధికారి ఎ.భాస్కర్‌రావు చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు అందజేశామని పేర్కొన్నారు. వర్షం వచ్చే సమయంలో ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు వేయాలని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని చెప్పారు. తుపాన్‌ ప్రభావం వల్ల వర్షాలు పడితే అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ అధికారులకు సూచించారు. అన్ని కేంద్రాల్లో త్వరతగతిన ధాన్యం కొనుగోళ్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇకపోతే రైతులు పండించిన ధాన్యం మొత్తంగా  కొనుగోలు చేస్తామని  అన్నారు. ఆయా ప్రాంతాల్లో తడిసిన ధాన్యం వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం తడిసినా.. పెద్ద నష్టం రాలేదన్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో 70 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉండగా.. ఇప్పటికే 72 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఎవరు కూడా అధైర్య పడాల్సిన పనిలేదన్నారు.