తప్పించుకున్న ఎర్రదొంగలు

ఇద్దరు పట్టివేత..62 దుంగలు స్వాధీనం

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఎర్ర చందన పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుంటున్నప్పటికి ఎర్ర చందన అక్రమ రవాణాకు అడ్డు అదుపులేకుండా పోతుంది. కడప జిల్లా ఖాజీపేట మండలం లంకమల్ల అభయారణ్యంలో అర్ధరాత్రి టాస్క్‌ ఫోర్స్‌, అటవీ అధికారుల కూంబింగ్‌ లో 62 ఎర్ర చందన దుంగలతో పాటు ఇద్దరు తమిళ కూలీలు పట్టుబడ్డారు. 29 మంది తమిళ కూలీలు పరారయ్యారు. టాస్క్‌ ఫోర్స్‌ ఎస్సై అలీ భాష మాట్లాడుతూ… ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు పై అధికారుల సూచనలతో రాబడిన సమాచారం మేరకు కూంబింగ్‌ నిర్వహించామని తెలిపారు. మొత్తం 31 మంది తమిళ కూలీలు ఎర్ర చందన దుంగలను తరలిస్తూ ఎదురుపడ్డారని తెలిపారు. రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, తమ టీమ్‌ అలెర్ట్‌ అయ్యి పట్టుకునే ప్రయత్నం చేయగా 29 మంది పారిపోగా ఇద్దరు పట్టుబడ్డారని తెలిపారు. వారి వద్ద నుండి 2.5 టన్నుల 62 ఎర్ర చందన దుంగలను స్వాధీనం చేసుకొని ఖాజీపేట పోలీస్‌ స్టేషన్లో అప్పగించామని తెలిపారు.