తప్పిన ముప్పు!

 

– ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో అగ్నిప్రమాదం

– సిలిండర్‌ పేలడంతో చలరేగిన మంటలు

– అప్రమత్తమై మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

లఖ్‌నవూ, జనవరి14(జ‌నంసాక్షి) : మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్న ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా ప్రదేశంలో దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. శిబిరం పక్కనే నిలిపి ఉంచిన కారు, అక్కడి టెంట్లు కొన్నింటికి మంటలు అంటుకోవడంతో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆరు ఫైరింజన్‌లు అక్కడికి చేరుకొని పది నిమిషాల్లో మంటలను అదుపులోకి తేవడంతో మంటలు విస్తరించకుండా అదుపు చేయగలిగారు. అయితే ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా యాత్రికులు భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదని ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచించారు. మంగళవారం నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. మొత్తం 3200 ఎకరాల్లో భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆశ్రయం పొందేందుకు దాదాపు 20వేల శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మేళా సందర్భంగా ఇప్పటికే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, సాధువులు, విదేశాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. భక్తులు స్నానమాచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలముకుపోయింది. దీంతో అక్కడి భక్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక అప్రమత్తతతో మంటలు వెంటనే అదుపుకావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు.